ఇవ్వండయ్యా బాబూ.. సెస్!
● రూ.47 కోట్లు పైగా బకాయిలు
చెల్లించని స్థానిక సంస్థలు
● నగరపాలక సంస్థలు,
పంచాయతీలదే అధిక వాటా
● ఉమ్మడి జిల్లాలో 102 గ్రంథాలయాలు
● అభివృద్ధికి శాపంలా మారిన బకాయిలు
● వెంటనే చెల్లించాలని విన్నపాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విజయవాడలో ప్రభుత్వం 35వ పుస్తక మహోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తున్న వేళ.. రాష్ట్రవ్యాప్తంగానే గ్రామీణ గ్రంథాలయాలకు ఊపిరి పోయాలని.. వీటికి పూర్వ వైభవం తీసుకు వచ్చే దిశగా అడుగులు వేయాలని పాఠకులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు డిజిటలైజేషన్ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో సైతం గ్రంథాలయాలకు మాత్రం ఎక్కడా ఆదరణ తగ్గడం లేదు. వీటికి వస్తున్న పాఠకుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో గ్రంథాలయాల్లో వసతులు మెరుగు పరచాలని పాఠకులు కోరుతూనే ఉన్నారు. స్థానిక సంస్థలు సెస్ బకాయిలు చెల్లిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాపంగా ఉన్న వివిధ స్థాయిల్లోని 102 గ్రంథాలయాలకు ప్రతి రోజూ 25 వేల నుంచి 30 వేల మంది పాఠకులు వస్తూంటారని అంచనా. గతంలో కంటే గ్రంథాలయాలకు వస్తున్న వారి సంఖ్యలో ఏడెనిమిది శాతం పెరుగుదల కనిపిస్తోంది.
ఏళ్ల తరబడి బకాయిలు
గ్రంథాలయాల నిర్వహణకు ప్రధాన వనరు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన సెస్. ప్రజల నుంచి ముక్కుపిండి మరీ స్థానిక సంస్థలు పన్నులు వసూలు చేస్తున్నా.. అందులోని వాటా మాత్రం ఏళ్ల తరబడి గ్రంథాలయాల ఖాతాలకు చేరడం లేదు. గ్రంథాలయాల సెస్‌ను స్థానిక సంస్థలే దర్జాగా వాడేసుకుంటున్నాయి. ఈవిధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి వసూలైన గ్రంథాలయ సెస్ రూ.47,13,87,848 కోట్ల మేర ఆయా స్థానిక సంస్థల వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. దీనిపై జిల్లా అధికారులను అడుగుతూంటే స్థానిక సంస్థల అధికారులతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో పదేపదే చెబుతున్నామంటున్నారే తప్ప.. ఆయా సంస్థలు చిల్లిగవ్వ కూడా బదలాయించిన దాఖలాలు కనిపించడం లేదు. 2007–08 నుంచి పెండింగ్‌లో ఉన్న కోట్లాది రూపాయల సెస్ బకాయిలు రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితి గ్రంథాలయాల పూర్వ వైభవానికి పెద్ద ప్రతిబంధకంగా పరిణమించింది.
ఒకప్పుడు 51.. నేడు 5
ఒకప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 51 గ్రామీణ గ్రంథాలయాలు ఉండేవి. వీటి నిర్వాహకులకు ప్రతి నెలా అప్పట్లో రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకూ వేతనం చెల్లించేవారు. వీటిల్లో పని చేసిన ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేయడంతో ఆ పోస్టులను తిరిగి భర్తీ చేయలేదు. ఫలితంగా 46 గ్రామీణ గ్రంథాలయాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఎ.మల్లవరం కట్టమూరు, ఉప్పలగుప్తం, తాటిపర్తి, సాకుర్రుల్లో మాత్రమే నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ గ్రంథాలయాల స్థానంలో గౌరవ వేతనంపై నిర్వహించే బుక్ డిపాజిటి సెంటర్లు (బీడీసీ – పుస్తక నిక్షిప్త కేంద్రం) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవే కొనసాగుతున్నాయి. అలానే రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతో పాటు పలు పట్టణాల్లో రిక్షాలపై పుస్తకాలు పెట్టి చదివించే మొబైల్ లైబ్రరీలు ఉండేవి. కాలక్రమేణా అవి కూడా కనుమరుగయ్యాయి.
గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు అవసరమని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపినా నిధులు లేవనే సాకుతో గాలికొదిలేశారు. ఈ పరిస్థితుల్లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు వచ్చి 2022లో రూ.1.20 కోట్ల వ్యయంతో పాఠకులు ఎంతో కాలంగా అభ్యర్థిస్తున్న సుమారు 80 వేల పుస్తకాలు కొనుగోలు చేసి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని గ్రంథాలయాలకు సమకూర్చింది.
కాకినాడలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గ్రంథాలయాల వివరాలు
జిల్లా కేంద్ర గ్రంథాలయం కాకినాడ
గ్రేడ్–1 శాఖా గ్రంథాలయాలు 5
గ్రేడ్–2 శాఖా గ్రంథాలయాలు 10
గ్రేడ్–3 శాఖా గ్రంథాలయాలు 86
మొత్తం 102
గ్రంథాలయాల్లో సభ్యులు 38,500
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2007–08
నుంచి 2023–24 వరకూ స్థానిక సంస్థలు
చెల్లించాల్సిన సెస్ బకాయిలు (రూ.)
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ 19,03,03,000.00
కాకినాడ నగర పాలక సంస్థ 9,66,35,752.00
మున్సిపాలిటీలు 2,38,47,626.00
గ్రామ పంచాయతీలు 16,06,01,470.00
సెస్ చెల్లించి చేయూతనివ్వాలి
స్థానిక సంస్థలు వెంటనే సెస్ బకాయిలు చెల్లించి గ్రంథాలయాల అభివృద్ధికి చేయూతనివ్వాలి. ఇటీవల పాఠకుల సంఖ్య పెరగడంతో అభివృద్ధికి నిధుల అవసరం ఉంది. ముఖ్యంగా కార్పొరేషన్ల నుంచి ఎక్కువగా బకాయిలు పేరుకుపోయాయి. జిల్లా యంత్రాంగాలు చొరవ తీసుకుని బకాయిలు జమ అయ్యేలా చూడాలి.
– వీఎల్‌ఎన్‌ఎస్‌వీ ప్రసాద్,
కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ, కాకినాడ
పాఠకులకు అందుబాటులో ఉండాలి
ప్రజల విజ్ఞానాన్ని పెంచడానికి ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. సామర్లకోటలోని గ్రంథాలయం అద్దె భవనంలో రెండో అంతస్తులో ఉండటంతో 40 మెట్లు ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. దీంతో, వృద్ధులు, దివ్యాంగులు, గ్రంథాలయానికి దూరమవుతున్నారు. విజ్ఞానాన్ని మరింతగా పెంచేలా గ్రంథాలయంలో పుస్తకాల సంఖ్య పెరగాలి.
– జి.రాజు, గ్రంథాలయ పాఠకుడు, సామర్లకోట
Comments
Please login to add a commentAdd a comment