హైందవ శంఖారావానికి తరలి రావాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఈ నెల 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావానికి లక్షలాదిగా హిందువులు తరలి రావాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జిల్లా అధ్యక్షుడు, శంఖారావం జిల్లా కన్వీనర్ ఆర్.రవిశంకర్ పట్నాయక్ కోరారు. గాంధీనగర్‌లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలైనా హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి దక్కలేదన్నారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేసి, స్వయం ప్రతిపత్తి కలిగిన ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలనే డిమాండుతో వీహెచ్‌పీ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా నుంచి సుమారు 300 బస్సులు చలో విజయవాడకు బయలుదేరుతున్నాయని తెలిపారు. 92400 1533 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి, వచ్చిన లింక్ ద్వారా పేరు రిజిస్టర్ చేసుకొని మద్దతు తెలపాలని కోరారు. వీహెచ్‌పీ కాకినాడ విభాగ్ సంఘటనా కార్యదర్శి గంధం గోవిందు, జిల్లా ఉపాధ్యక్షురాలు చల్లా శ్రీకృష్ణవాణి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా హైందవ శంఖారావం జెండాలు, బ్యానర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ సీనియర్ నేతలు మద్దూరి శ్రీరామచంద్రమూర్తి, గరిమెళ్ళ అన్నపూర్ణయ్యశర్మ, జిల్లా సహ కార్యదర్శి జి.ఉదయ భానోజీరావు, నగర అధ్యక్షుడు రెడ్నం రాజా పాల్గొన్నారు.
రేపటి నుంచి యూటీఎఫ్
స్వర్ణోత్సవ మహాసభలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపీ యూటీఎఫ్) స్వర్ణోత్సవ మహాసభలు కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో సమానత్వ భావనను ప్రోది చేసే ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి, పరిరక్షణకు, ఉపాధ్యాయుల సంక్షేమానికి గత 50 ఏళ్లుగా యూటీఎఫ్ ఎంతో కృషి చేసిందని చెప్పారు. మా ధర్మం గొప్పదంటే మా ధర్మం గొప్పదనే చర్చలు నడుస్తున్న ప్రస్తుత కాలంలో ఏ ధర్మాన్ని పాటించాలో ఉపాధ్యాయులు తేల్చుకోవాలన్నారు. రాజ్యాంగ ధర్మాన్ని పాటించాలని, సమానత్వాన్ని, లౌకికత్వాన్ని విద్యార్థులకు నేర్పాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం నినాదంగా ఈ మహాసభలు జరుగుతున్నాయని వెంకటేశ్వర్లు తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు రెడ్డి మోహనరావు, ఎన్.అరుణకుమారి, ఎస్.కిషోర్ కుమార్, టి.అన్నారాం మాట్లాడుతూ, నూతన ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తవుతోందని, 12వ పీఆర్‌సీని ఇంతవరకూ నియమించలేదని తెలిపారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సభల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు హాజరై, విద్యారంగంపై వారి అభిప్రాయాలు తెలియజేస్తారని చెప్పారు. సాంస్కృతిక సదస్సు, మహిళా సదస్సు, ఉద్యమ సదస్సుల్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం స్వర్ణోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీవీ నాగేశ్వరరావు, టి.రవి చక్రవర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment