అమ్మో.. భూచోళ్లు!
● కాకినాడ రూరల్‌లో
రూ.2 కోట్ల స్థలం కబ్జాకు యత్నం!
● సర్పవరంలో జనసేన నేత నిర్వాకం!
● రిటైర్డ్ ఉద్యోగుల స్థలాలకూ అదే గతి
● కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం చేతిలో ఉందనే ధీమాతో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. తమ మాటకు తిరుగు లేదని బరి తెగిస్తున్నారు. భూమి కనిపిస్తే చాలు కబ్జాకు వెనుకాడటం లేదు. ఏళ్ల తరబడి వివాదాల్లో ఉన్న స్థలాలను సైతం అధికార దర్పంతో చక్కబెట్టేస్తున్నారు. ప్రభుత్వం భూముల విలువ పెంచేందుకు సిద్ధమవుతోన్న తరుణంలో ఈ తరహా భూ కబ్జాలు కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెచ్చు మీరుతున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. పాగా వేసేందుకు వారు ఏమాత్రం వెనుకాడటం లేదు. వివాదాల్లో ఉన్న భూములను సైతం సొంతం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని రమణయ్యపేట, సర్పవరం, వాకలపూడి, వలసపాకలు తదితర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ గ్రామాల్లో ఖాళీ స్థలాలు కొట్టేసే నేతలు పెరిగిపోయారు. సర్పవరం మేజర్ గ్రామ పంచాయతీ పరిసరాల్లో గజం స్థలం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అనుచరుడైన జనసేన నాయకుడు పుల్లా శ్రీరాములు రూ.2 కోట్ల విలువైన తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తమ స్థలం కబ్జా కాకుండా చూడాలని బాధిత కుటుంబం కలెక్టర్ షణ్మోహన్‌కు సోమవారం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగిందంటే..
కాకినాడ రూరల్ మండలం సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్పవరం గ్రామ సర్వే నంబర్ 106, 107, 108ల్లో కాకినాడ పోస్టల్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు కొన్నేళ్ల కిందట ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు. వాటిని ప్లాట్లుగా విభజించారు. ఎల్‌పీ నంబరు 119/1992లోని ప్లాట్ నంబర్ 49లో 300 చదరపు గజాల స్థలాన్ని అనకాపల్లి జిల్లాలోని మండల కేంద్రమైన సబ్బవరం గ్రామానికి చెందిన నేమాని శ్రీరామశాస్త్రి నుంచి దస్తావేజు నంబర్ 2296/2008గా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన గుత్తుల జాన్సన్ కొనుగోలు చేశారు. అదే లే అవుట్‌లో ప్లాట్ నంబర్ 37లో మరో 358 చదరపు గజాల స్థలాన్ని దస్తావేజు నంబర్ 370/2009లో విశాఖ నగరం చావలవారి వీధికి చెందిన బొల్లాప్రగడ నాగమణి నుంచి కొన్నారు. రెండు ప్లాట్లు కలిపి మొత్తం 658 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసి, ఒకటిన్నర దశాబ్దాలైంది. ప్రస్తుతం ఇక్కడ భూముల రేట్లు గణనీయంగా పెరిగిపోయాయి. గజం రూ.30 వేల వంతున చూసుకున్నా ఈ మొత్తం స్థలం రూ.2 కోట్లు పైనే పలుకుతుంది. ఇంత విలువైన స్థలాన్ని కొట్టేసేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భయభ్రాంతులకు గురి చేస్తూ..
సర్పవరంలో ఉన్న ఈ స్థలాలపై జాన్సన్‌కు శ్రీరాములు, తుమ్మలపల్లి కృష్ణకుమార్, పుల్లా గోవిందు, మాదే చంద్రరావు, పాలెపు ధర్మరావు తదితరుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు బెదిరింపులకు దిగుతున్నారని ఇటీవల జాన్సన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో, గంజాయి బ్యాచ్, రౌడీ మూకలతో దౌర్జన్యంగా తమ స్థలాల్లోకి చొరబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ అనుమతులు లేకుండానే తుమ్మలపల్లి కృష్ణకుమార్ అడ్డగోలుగా గోడౌన్ కూడా నిర్మించేశారని చెబుతున్నారు. ఏపీఐఐసీకి చెందిన భూములను ఆ కార్పొరేషన్ పరిధిలో చూపకుండా పుల్లా గోవిందు తప్పుడు దస్తావేజులతో విక్రయాలు జరుపుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. జాన్సన్‌తో పాటు తపాలా కార్యాలయంలో పని చేసిన ఉద్యోగుల లే అవుట్ స్థలాలు కూడా కబ్జాకు గురయ్యాయి. తపాలా శాఖలో పని చేసి, ఉద్యోగ విరమణ అనంతరం సొంతిల్లు నిర్మించుకునేందుకు వెళ్లి చూస్తే స్థలాలు కబ్జాకు గురైనట్టు గుర్తించిన బాధితులు లబోదిబోమంటున్నారు.
తహసీల్దార్‌కు లేఖ రాస్తాం
కబ్జాపై అడిగిన సందర్భాల్లో తమపై దౌర్జన్యానికి దిగిన శ్రీరాములుపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. చేసేది లేక స్థలాన్ని కబ్జా చేసి, ఆక్రమణదారులు నిర్మించిన గోడను బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి సోమవారం సాయంత్రం కూల్చేశారు. దీంతో ఈ వివాదం పోలీసుల వరకూ వెళ్లింది. ఈ వివాదంపై సర్పవరం ఏఎస్సై నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆ భూమి తమదంటే తమదని ఇరు పక్షాలూ చెబుతున్నాయని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఈ విషయంలో వాస్తవం ఏమిటో తేల్చాల్సిందిగా తహసీల్దార్‌కు లేఖ రాయాలని నిర్ణయించామని చెప్పారు.
మా స్థలాలు ఆక్రమించారు
ఎంతో కష్టపడి 2008లో ఒకటి, 2009లో మరొకటి స్థలాలు కొనుకున్నాం. వీటిని పుల్లా శ్రీరాములు తదితరులు ఆక్రమించుకున్నారు. రౌడీ మూకలతో వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదివరకే పోలీసులకు ఫిర్యాదులు చేస్తే శ్రీరాములుపై రౌడీ షీట్ తెరిచారు. తిరిగి ఆదివారం వంద మంది వరకూ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌తో వచ్చి దౌర్జన్యం చేసి, శ్రీరాములు ఆధ్వర్యంలో జనసేన నాయకులు, వారి అనుచరులు ఆక్రమించుకున్నారు. కలెక్టర్ న్యాయం చేస్తారని వినతిపత్రం ఇచ్చాం.
– గుత్తుల జాన్సన్, మాధవపట్నం, సామర్లకోట
Comments
Please login to add a commentAdd a comment