అధికారం మారడంతో పేదలకు ఇబ్బందులు
కాకినాడ రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో గత ఐదేళ్లూ సంక్షేమ నామ సంవత్సరాలుగా భాసిల్లాయని, రాష్ట్రంలో ఇప్పుడు అధికారం మారడంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రమణయ్యపేట వైద్యనగర్ కార్యాలయం వద్ద బుధవారం ఆయన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, అభిమానులు, జిల్లాలోని పలువురు నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, గజమాలలతో సత్కరించారు. కన్నబాబు మాట్లాడుతూ రైతులకు సంబంధించి ఉచిత బీమా ఎత్తివేశారని, గిట్టుబాటు ధర బస్తాకు రూ.200 వరకు పడిపోయిందని, కనీసం పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదన్నారు. రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం పనిచేయాలన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలన్నారు. కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పి పెంచారని, ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకుంటున్నారని, లారీ ఇసుకకు రూ.23వేలు అవుతోందన్నారు. నూతన సంవత్సరంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. కన్నబాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, అల్లి రాజబాబు తదితరులు ఉన్నారు.
న్యూ ఇయర్ వేడుకల్లో
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
Comments
Please login to add a commentAdd a comment