ఫ్లెక్సీ వివాదంలో ఘర్షణ
ప్రత్తిపాడు: టీడీపీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఫ్లెక్సీ వివాదంలో ఒకరు గాయపడిన ఘటన ఇది. మండలంలోని లంపకలోవ గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం సాయంత్రం ఫ్లెక్సీ కట్టే విషయమై ఈ వివాదం చోటు చేసుకుంది. టీడీపీలోని రెండు వర్గాల మధ్య రేగిన ఈ రగడ ఒకరిని కత్తి పోటుకు గురిచేసింది. టీడీపీలో ముందు నుంచి ఉన్న వర్గీయులకు, వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ వర్గానికి పొసగడం లేదు. ఒక వర్గం ప్లెక్సీ ఏర్పాటు చేస్తుంటే గొంతిన సురేష్ వర్గీయులు అభ్యంతరం చెప్పడంతో వివాదం ముదిరింది. వివాదం ముదిరి పాకాన పడడంతో గొంతిన సురేష్ వర్గీయులు మరో వర్గం కార్యకర్త అవిడి అంజిబాబుపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన అంజిబాబును చికిత్స కోసం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఈ విషయమై ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతంను వివరణ కోరగా ఇరువర్గాలను విచారించి, కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ సంఘటనతో టీడీపీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు గుప్పుమన్నాయి. కాగా గొంతిన సురేష్ వర్గానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మద్దతు ఇస్తున్నారని ఓ వర్గం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తపై దాడి జరిగితే ఎమ్మెల్యే స్పందించలేదని వారు అంటున్నారు. బాధితుడికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఒకరికి గాయాలు
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
Comments
Please login to add a commentAdd a comment