సైబర్ టెర్రర్
● పొంచి ఉన్న ప్రమాదాన్ని
ప్రతిబింబించిన వార్షిక నేర నివేదిక
● గణనీయంగా పెరిగిన సైబర్ నేరాలు
● హత్యల్లోనూ స్పల్ప పెరుగుదల
● మహిళలపై నేరాల పెరుగుదలతో
ఆందోళన
సదస్సులతో సత్ఫలితాలు
జిల్లాలో వివిధ అంశాలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు సత్ఫలితాలనిస్తున్నాయి. డిజిట ల్ అరెస్టు, స్టాక్ మార్కెట్, ఫండింగ్, జాబ్, కేవైసీ మోసాలపై విస్తృత అవగాహన కల్పించాం. మహిళా రక్షక్ వాహనాల ద్వారా మహిళలు, యువతులు, విద్యార్థినులకు అందిస్తున్న భద్రత మరింత బలోపేతమైంది. సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సహకారం కోరాం. శాంతిభద్రతలను మరింతగా పరిరక్షించేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచుతాం. ప్రజలు మంగళవారం రాత్రి నూతన సంవత్సర వేడుకల నిర్వహణలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. పోలీసులకు సహకరించాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
– విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ, కాకినాడ
కాకినాడ క్రైం: మరొక్క రోజులో కాలగర్భంలో కలసిపోనున్న 2024 సంవత్సరం నేరాల విషయంలో చేదునే మిగిల్చింది. ముఖ్యంగా ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఽహత్యల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. మహిళలపై చోటు చేసుకుంటున్న నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వార్షిక నేర నివేదికలో స్వల్ప సానుకూలత, పుష్కలంగా ప్రతికూలత గోచరించాయి. ఈ వివరాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
బాబోయ్ సైబర్
గతంలో ఎన్నడూ లేని రీతిలో సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్న తీరు కలవరపెడుతోంది. 2023లో జిల్లా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు అందిన ఫిర్యాదులు 1,854 కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 2,672కు పెరిగింది. గత ఏడాది 39 ఎఫ్‌ఐఆర్‌లు నమోదవగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 55కు చేరింది. సైబర్ నేరగాళ్లు గత ఏడాది దోచుకున్న సొత్తు రూ.8.32 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆ విలువ రూ.26.57 కోట్లు అంటే గతం కంటే సుమారు మూడు రెట్లు అధికమన్న మాట.
28 హత్యలు
జిల్లాలో 2023లో 21 హత్యలు జరగగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 28కి పెరిగింది. వీటిల్లో కుటుంబ తగాదాల వల్ల చోటు చేసుకున్నవే అధికం. హత్యాయత్నాలు 56, తీవ్రగాయాలతో కూడుకున్న యత్నాలు 59, స్వల్పగాయాలతో కూడిన హత్యాయత్నాలు 642 జరిగాయి.
రికవరీ 65 శాతం
వివిధ దొంగతనాల్లో పోలీసులు ఈ ఏడాది 65 శాతం సొత్తు రికవరీ చేశారు. ఈ ఏడాది వివిధ దొంగతనాలు 710 జరిగాయి. వీటిలో సాధారణం 561 కాగా, రాత్రి దొంగతనాలు 109, పగటి దొంగతనాలు 32, దోపిడీలు 6, హత్య చేసి, దోచుకెళ్లిన ఘటనలు రెండు ఉన్నాయి.
అయ్యో మహిళా!
మహిళలపై చోటు చేసుకుంటున్న నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో వరకట్న వేధింపులు తాళలేక ఇద్దరు మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 67 మంది మహిళలు లైంగిక దాడి లేదా లైంగిక దాడి యత్నాల్లో బాధితులుగా మారారు. వరకట్న వేధింపులకు గురైన మహిళలు 379. ఈ సంఖ్య గత ఏడాది 330. మహిళలను అవమానించిన ఘటనలు 194 కాగా 2023లో ఈ సంఖ్య 118.
రోడ్డు ప్రమాదాల్లో తగ్గిన మరణాలు
గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారు 295 మంది కాగా, 2023లో ఈ సంఖ్య 326గా నమోదైంది. అప్పట్లో చోటు చేసుకున్న ప్రమాదాలు 295 అయితే ఈ ఏడాది 287 నమోదయ్యాయి. ఈ ఏడాది ప్రమాదాల్లో గాయపడిన వారు 117 మంది కాగా గత ఏడాది వారి సంఖ్య 132.
మందుబాబులపై కేసులు
మందుబాబులపై ఈ ఏడాది పోలీసులు గణనీయంగానే కేసులు పెట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 7,879 మంది, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 7,698 మందిపై కేసులు నమోదు చేశారు.
1,791 సెల్‌ఫోన్ల రికవరీ
గత ఏడాదితో పోలిస్తే సెల్‌ఫోన్ల రికవరీ గణనీయంగా పెరిగింది. 2023లో 1,080 సెల్‌ఫోన్లు రికవరీ చేయగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,791కి చేరింది. ఈ ఏడాది పోలీసుల ప్రోత్సాహంతో 516 మంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా 55 మంది అనుమానితుల్ని పోలీసులు గుర్తించారు. 97 మందిని పట్టుకున్నారు.
పోలీస్ సేవలో నాలుగు డ్రోన్లు
నేరాల నియంత్రణకు సాంకేతికతను ఆశ్రయిస్తున్నామని ఎస్‌పి విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ నేపథ్యంలో గతేడాది ఒక డ్రోన్ ఉంటే ఈ ఏడాది నాలుగు డ్రోన్లు జిల్లా పోలీస్ శాఖకు సమకూరాయి అన్నారు. జిల్లాలో 156 చోట్ల నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
1,337 కిలోల గంజాయి స్వాధీనం
ఈ ఏడాది 1,337 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 87 మంది స్మగ్లర్లను, పొరుగు రాష్ట్రాలకు చెందిన 14 మంది నిందితులను అరెస్టు చేశారు. 17 మందిపై ఎన్‌డీపీఎస్ రౌడీ షీట్లు తెరిచారు. 20 మంది సిబ్బంది, అధికారులతో నాలుగు యాంటీ డ్రగ్ స్క్వాడ్‌లను నియమించారు. జిల్లాలో 19 గంజాయి హాట్‌స్పాట్లు గుర్తించారు. గంజాయి అనర్థాలను వివరిస్తూ 860 సదస్సులు నిర్వహించి, సుమారు లక్ష మందికి అవగాహన కల్పించారు.
మరికొన్ని..
● 21 నేరాల్లో నిందితులుగా ఉన్న దోపిడీదారుల్ని పట్టుకొని సుమారు రూ.కోటి బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
● దళితులపై చోటు చేసుకున్న నేరాలు ఈ ఏడాది 65 కాగా, గత ఏడాది ఈ సంఖ్య 52.
● ప్రత్తిపాడు పరిధిలో బ్యాంకులో బంగారం దోచుకెళ్లిన ఘటనలో పొరుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 2.4 కిలోల వెండి, రూ.4.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి గాను జిల్లా పోలీసు శాఖను ప్రతిష్టాత్మక ఏబీసీడీ అవార్డు వరించింది.
● సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లు లూటీ చేస్తున్న 21 మంది దొంగల్ని పట్టుకున్నారు. వారి నుంచి భారీగా బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment