డాక్టర్ యనమదలకు మానవతా పురస్కారం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వివిధ రంగాల్లో నైపుణ్యం చూపుతూ, ప్రజాసేవలో నిమగ్నమైన వారికి మానవతా స్వచ్ఛంద సేవా సమితి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అవార్డులను ప్రకటించింది. ఇందులో కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణను జాతీయ స్థాయి ఉత్తమ వైద్యుల కేటగిరీలో అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సమాచారాన్ని సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముసిని రామకృష్ణారావు గురువారం మురళీకృష్ణకు తెలియజేశారు. సేవా సమితి ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం అర్ధ శతాబ్ది కళా ఉత్సవాల సంబరాలు నిర్వహిస్తోంది. అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే ఈ కళా ఉత్సవాలు, అవార్డుల ప్రదానోత్సవంలో డాక్టర్ మురళీకృష్ణకు ఈ పురస్కారం అందజేయనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులపై అఖిల భారత స్థాయిలో పలు గ్రంథాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో అందరికంటే ముందుగా హెచ్‌ఐవీ నియంత్రణకు రెండు మందుల విధానాన్ని అమలు చేసిన తొలి వైద్యుడిగా గుర్తింపు పొందడం, దీర్ఘకాలిక వ్యాధులపై హెల్త్ జర్నల్స్‌లో రాసిన పరిశోధనాత్మక గ్రంథాలకు గాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు.
9న జాబ్‌మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 9న అమర్‌రాజా గ్రూప్ కంపెనీ ఆధ్వర్యాన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో వివిధ ట్రేడ్‌లలో ఉత్తీర్ణులై, ఎన్‌టీసీ సర్టిఫికెట్ కలిగిన వారు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.21 వేల వేతనం చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో ఆ రోజు ఉదయం 9 గంటలకు కళాశాలకు హాజరు కావాలని, వివరాలకు 86392 30775 నంబరులో సంప్రదించాలని సూచించారు.
ఎస్‌ఎంసీల సహకారం అవసరం
కాకినాడ రూరల్: పాఠశాల నిర్వహణ, అభివృద్ధికి యాజమాన్య కమిటీల (ఎస్‌ఎంసీ) సహకారం ఎంతో అవసరమని, వీటి పాత్ర కూడా కీలకమైనదని సర్వశిక్షా అభియాన్ కాకినాడ సీఎంఓ చామంతి నాగేశ్వరరావు అన్నారు. ఎస్‌ఎంసీల శిక్షణ కార్యక్రమాన్ని ఏపీఎస్‌పీ క్వార్టర్స్ జెడ్పీ హైస్కూలులో గురువారం నిర్వహిచారు. ఎంఈఓ–1, 2లు వేణుగోపాల్, ఏసుదాసుల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎస్‌ఎంసీల విధులు బాధ్యతలు, సమావేశాల నిర్వహణ, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారీ, సామాజిక తనిఖీ, పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ప్రధానోపాధ్యాయులకు ఎదురయ్యే సమకాలీన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన రీసోర్స్ పర్సన్లు వివరిస్తారని అన్నారు. ప్రతి పాఠశాలకు ఒక కరదీపికను కూడా అందజేస్తామని చెప్పారు. ఎంఈఓలు మాట్లాడుతూ, కమిటీల భాగస్వామ్యం, ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని గాయత్రి, మండలంలోని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసీల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే శాఖకు
భూములు అప్పగించాలి
అమలాపురం రూరల్: కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్‌మెంట్ ప్రతిపాదనల ప్రకారం ఇప్పటికే సేకరించిన భూములను స్వాధీన పరుచుకుని రైల్వే శాఖకు అప్పగించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం రెవెన్యూ అధికారులతో రైల్వే లైన్ అలైన్‌మెంట్ భూముల స్వాధీనం, అవార్డులు పాస్, భూ నష్టపరిహారాలు చెల్లింపు తదితర పెండింగ్ అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ సమస్యలను అధిగమించే ప్రయత్నంతో పాటుగా భూముల సేకరణకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఇన్‌చార్జి డీఆర్‌ఓ కె.మాధవి, రెవెన్యూ డివిజనల్ అధికారులు డి.అఖిల పి.శ్రీకర్, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి, అయినవిల్లి తహసీల్దార్ నాగలక్ష్మి, డీటీ ఏసుబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment