రత్నగిరిపై డిజిటల్‌ పేమెంట్ల కౌంటర్‌ | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై డిజిటల్‌ పేమెంట్ల కౌంటర్‌

Published Fri, Jan 3 2025 2:23 AM | Last Updated on Fri, Jan 3 2025 2:23 AM

రత్నగిరిపై డిజిటల్‌ పేమెంట్ల కౌంటర్‌

రత్నగిరిపై డిజిటల్‌ పేమెంట్ల కౌంటర్‌

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో డిజిటల్‌ పేమెంట్ల కౌంటర్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రత్నగిరిపై పశ్చిమ రాజగోపురం వద్ద ఉన్న వ్రతాలు, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కౌంటర్‌కు ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ కౌంటర్‌ ను దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.సుబ్బారావు ప్రారంభించారు. మొదటిగా భక్తుడు, స్థానిక వ్యాపారి వీర్ల రాంబాబు రూ.2 వేల వ్రతం టికెట్టును డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా కొనుగోలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కౌంటర్‌లో ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌ పే, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో సత్యదేవుని వ్రతం, దర్శనం, లక్ష్మీ ప్రయుక్త ఆయుష్య హోమం, ప్రత్యంగిర హోమం (అడ్వాన్స్‌) టికెట్లు కొనుగోలు చేశారు. ఉదయం 10 గంటలకు ఈ కౌంటర్‌ను ప్రారంభించగా.. చాలా మంది భక్తులు నగదు కన్నా డిజిటిల్‌ పద్ధతిలో టికెట్లు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపించారని అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితం నుంచే పీఆర్‌ఓ కార్యాలయంలోని కౌంటర్‌లో డిజిటల్‌ పేమెంట్ల ద్వారా ప్రయోగాత్మకంగా టికెట్లు విక్రయిస్తున్నారు. అయితే అధికారికంగా ఈ రోజు నుంచే డిజిటల్‌ పేమెంట్ల ద్వారా టికెట్ల విక్రయాలు అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

తొలి రోజు రూ.97,708 ఆదాయం

డిజిటల్‌ పేమెంట్ల కౌంటర్‌ ద్వారా దేవస్థానానికి తొలి రోజు రూ.97,708 ఆదాయం వచ్చింది. సత్యదేవుని వ్రతం రూ.300 టిక్కెట్లు 34, రూ.1,000 టికెట్లు 12, రూ.1,500 టికెట్లు 16, లక్ష్మీ ప్రయుక్త ఆయుష్య హోమం ఆన్‌లైన్‌లో రూ.1,116 చొప్పున రెండు, స్వయంగా ఆచరించేందుకు రూ.1,000 చొప్పున మూడు టిక్కెట్ల భక్తులు కొనుగోలు చేశారు. అలాగే, ఆన్‌లైన్‌ వ్రతానికి రూ.1,116 చొప్పున ఎనిమిది టికెట్లు, రూ.2 వేల వ్రతం టికెట్లు రూ.17, వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం (అడ్వాన్స్‌) టికెట్లు రూ.1,116 చొప్పున మూడు టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. డిజిటల్‌ పేమెంట్ల ద్వారా టిక్కెట్ల కొనుగోలుకు భక్తులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అధికారులు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పశ్చిమ రాజగోపురం వద్ద డిజిటల్‌ కౌంటర్‌ పని చేస్తుందన్నారు. రామాలయం ఎదురుగా పీఆర్‌ఓ కార్యాలయం వద్ద ఉన్న కౌంటర్‌ రాత్రి 9 గంటల వరకూ పని చేస్తుందని తెలిపారు.

సత్యదేవుని సన్నిధిలో

పశ్చిమ రాజగోపురం వద్ద ప్రారంభం

ఇప్పటికే ప్రయోగాత్మకంగా

పీఆర్‌ఓ ఆఫీసులో విక్రయాలు

ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌ పే, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో సేవా టిక్కెట్ల విక్రయాలు

‘సాక్షి’ కథనాలతో కదలిక

దేవస్థానంలో డిజిటల్‌ పేమెంట్లు లేక భక్తులు ఇబ్బంది పడుతున్న అంశాన్ని గతంలో ‘సాక్షి’ దినపత్రిక అనేకసార్లు తన కథనాల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. గత నెల 26న ‘రొక్కమే దిక్కు’, గత ఏడాది జనవరి 21న ‘నోటుపాట్లు’ శీర్షికన కథనాలు ప్రచురించింది. వీటి ద్వారా డిజిటల్‌ పేమెంట్లు లేక సత్యదేవుని సన్నిధిలో భక్తులు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఎట్టకేలకు రత్నగిరిపై డిజిటల్‌ పేమెంట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీనిపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో ప్రసాద విక్రయాలు కూడా..

త్వరలో ప్రసాదం ప్యాకెట్ల విక్రయాలను కూడా డిజిటల్‌ పేమెంట్ల ద్వారా జరపనున్నారు. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో సాఫ్ట్‌వేర్‌ రూపొందించనున్నామని అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement