సైన్స్ సంబరానికి వేళాయె..
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించే లక్ష్యంతో ఏటా నిర్వహిస్తున్న సైన్స్ సంబరాలు శుక్రవారం కాకినాడలో జరగనున్నాయి. పాఠశాల విద్యా శాఖ, విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం (బెంగళూరు) ఆధ్వర్యాన నిర్వహిస్తున్న దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శన–2025కు స్థానిక సాలిపేట బాలికోన్నత పాఠశాల వేదికగా నిలవనుంది. మండల స్థాయిలో గత నెల 30, 31 తేదీల్లో ఈ పోటీలు నిర్వహించగా.. వ్యక్తిగత విభాగం నుంచి 42, ప్రాజెక్టుల గ్రూపు నుంచి 42, ఉపాధ్యాయుల విభాగం నుంచి 42 కలిపి మొత్తం 126 ప్రాజెక్టులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో ప్రతి గ్రూపు నుంచి రెండు ప్రాజెక్టులను ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు పంపిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులు ఈ ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు.
మూడు కేటగిరీల్లో..
ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు మూడు కేటగిరీల్లో ఎనిమిది అంశాలపై నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల ప్రదర్శన (ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే), విద్యార్థుల వ్యక్తిగత ప్రదర్శన (ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు), విద్యార్థుల గ్రూప్ (ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు) విభాగాల్లో పోటీలు ఉంటాయి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, భూమి, అంతరిక్ష శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజినీరింగ్, జీవ రసాయన శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, జీవశాస్త్రం అంశాలపై ప్రాజెక్టులు ఉంటాయి.
నేడు జిల్లా స్థాయి సైన్స్ పోటీలు
సాలిపేట బాలికోన్నత పాఠశాలలో
126 ప్రాజెక్టుల ప్రదర్శన
మేధోసంపత్తికి పదును..
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయి. మండల స్థాయిలో ఎంపికై న ఉత్తమ ప్రాజెక్టులతో ఆయా విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ప్రదర్శనలో పాల్గొంటారు. విద్యార్థుల్లో మేధోసంపత్తికి పదును పెట్టేందుకు ఉపకరించే ఈ ప్రదర్శనల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు చైతన్యపరచాలి. విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, కొత్త ఆలోచనలకు రూపకల్పన చేయాలి.
– పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి,
కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment