విచ్చలవిడిగా ఇసుక, మట్టి తవ్వేస్తూండటంతో కృష్ణవరం వద్ద ఏలేరు కాలువ లోతుగా తయారైంది. దీంతో రెండో పంట సాగు నీటికి కటకటలాడాల్సి వస్తుందని ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు. కాలువకు ఒక పక్కన వేలంక, గెద్దనాపల్లి, పెద్దనాపల్లి, మరోవైపు కృష్ణవరం, పాత కృష్ణవరం, సోమరాయణంపేట, తామరాడ, గోనేడ, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లోని 6 వేల ఎకరాల్లో రెండో పంటకు సాగునీరు అందడం గగనమైపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వరదల సమయంలో ఏలేరు ఊళ్లకు ఊళ్లను ముంచెత్తి, ఏడెనిమిది వేల మంది ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందనే భయం స్థానికులను వెంటాడుతోంది. వాస్తవానికి డిసెంబర్‌లో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి నాటికే ఏలేరు ఆయకట్టు రైతులు దమ్ములు చేసుకునే పరిస్థితి ఉండేది. కృష్ణవరం వద్ద సాగుతున్న అక్రమ తవ్వకాలతో నీరు అందక.. ఆయకట్టు ప్రాంతాల్లో ఇప్పటి వరకూ దమ్ములు పూర్తి కాలేదు. సొంతంగా బోర్లు ఉన్న రైతులు అక్కడక్కడ వ్యవసాయ పనులు చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఏలేరు కాలువలో తవ్వకాలను కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment