దండిగా హుండీ ఆదాయం
●
● 28 రోజులకు రూ.1,52 కోట్ల రాబడి
● రత్నగిరిపై హుండీల లెక్కింపు
అన్నవరం: సత్యదేవునికి హుండీల ద్వారా ఈ నెలలో దండిగా ఆదాయం సమకూరింది. దేవస్థానంలో హుండీలను సోమవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా గత 28 రోజులకు రూ.1,52,58,438 ఆదాయం వచ్చిందని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు తెలిపారు. ఇందులో రూ.1,46,41,197 నగదు, రూ.6,17,241 చిల్లర నాణేలు ఉన్నాయి. వీటితో పాటు 16.800 గ్రాముల బంగారం, 745 గ్రాముల వెండి వస్తువులు కూడా లభించాయి. అలాగే, అమెరికన్ డాలర్లు 1,901, మలేషియా రింగిట్‌లు 105, కెనడా డాలర్లు 15, సౌదీ అరేబియా దీనార్లు 1,230, యూరోలు 35, ఆస్ట్రేలియా డాలర్లు 25, ఇంగ్లండ్ పౌండ్లు 15, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమెన్ బైసాలు 200, సింగపూర్ డాలర్లు 62 లభించాయి. సగటున రోజుకు రూ.5.45 లక్షల చొప్పున ఆదాయం రావడం విశేషం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేవస్థానానికి పెద్ద మొత్తంలో హుండీ ఆదాయం రావడం ఒకింత ఊరట కలిగించే అంశం.
సాధారణంగా కార్తికం (నవంబర్) తరువాత మళ్లీ మాఘమాసం వరకూ అంటే ఫిబ్రవరి వరకూ స్వామివారి ఆలయానికి పెద్దగా భక్తులు రారు. అందువలన ఆదాయం తగ్గుతుంది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా భక్తులు తరలి రావడంతో హుండీ ఆదాయం గణనీయంగా వచ్చింది. కార్తికం మినహాయిస్తే గత నాలుగు నెలల్లో ఈసారే అత్యధికంగా ఆదాయం సమకూరడం మరో విశేషం. సెప్టెంబర్ నెలలో 28 రోజులకు రూ.78.54 లక్షలు, అక్టోబర్‌లో 30 రోజులకు రూ.1.22 కోట్లు, కార్తికంలో నవంబర్ 19, డిసెంబర్ రెండో తేదీన రెండుసార్లు హుండీ ఆదాయం లెక్కించగా రూ.3.04 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది. హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం సిబ్బందితో పాటు శ్రీహరి సేవ, శ్రీవారి సేవ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు. హుండీ ఆదాయాన్ని స్థానిక స్టేట్ బ్యాంక్‌లో జమ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment