ఇసుక దొంగలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏలేరు కాలువలో దొంగలు పడ్డారు. ఒక రోజూ రెండు రోజులూ కాదు.. ఏకంగా రెండు మూడు నెలలుగా అధికార పార్టీ నేతల దన్నుతో బరితెగించేసి మరీ ఏలేరుకు తూట్లు పొడిచేస్తున్నారు. కాలువను 20 నుంచి 30 అడుగుల లోతున నిట్టనిలువునా తవ్వేసి, ఇసుక, మట్టి తెగనమ్ముకుంటూ లక్షల రూపాయలు దిగమింగేస్తున్నారు. సీనియర్ శాసన సభ్యుడు జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం కృష్ణవరం కేంద్రంగా ఈ వ్యవహారం నిరాటంకంగా సాగిపోతోంది. కృష్ణవరం శివాలయం సమీపాన మట్టి, పాత కృష్ణవరం శ్మశానవాటిక ప్రాంతంలో ఇసుక అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. కృష్ణవరం వద్ద ఇసుక, మట్టి తవ్వకానికి రెండు ప్రాంతాల్లో 200 హార్స్‌పవర్ మెషీన్లు రెండేసి చొప్పున ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం నుండి తవ్వోడ (డ్రెడ్జింగ్ బోటు) రప్పించి మరీ పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక, మట్టి కొల్లగొట్టేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలవుతున్న తవ్వకాలు మర్నాడు ఉదయం 8 గంటల వరకూ విరామం లేకుండా సాగుతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏలేరుకు ఇంతలా తూట్లు పొడిచేస్తున్నా.. కట్టడి చేయాల్సిన మూడు శాఖలు గాఢ నిద్రలో జోగుతూండటంపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి.
రూ.కోట్లలో లూటీ
ఏలేరు కాలువలో తవ్వుతున్న ఇసుక, మట్టిని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ప్రతి నిత్యం 40 నుంచి 50 లారీల్లో తరలించేసి, సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా తుని, అన్నవరం, కత్తిపూడి, ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ నగరాలకు ఇసుక తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం, వేమగిరి, కడియం తదితర ప్రాంతాల్లో గోదావరి ఇసుక దొరకనప్పుడు ఏలేరు ఇసుకను లారీ కిరాయితో కలిపి రూ.1,3000 నుంచి రూ.14,000 వరకూ అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. ఇసుక దొరకడం మొదలయ్యాక ప్రస్తుతం రూ.10,000 నుంచి రూ.11,000 వరకూ వసూలు చేస్తున్నారు. ఒక్కో లారీ తక్కువలో తక్కువ మూడు ట్రిప్పులు వేస్తున్నాయి. ఇలా రోజుకు 120 నుంచి 150 ట్రిప్పుల ఇసుక, మట్టి తెగనమ్మేసి రూ.లక్షలు దిగమింగేస్తున్నారు. రోజుకు రూ.13.50 లక్షల చొప్పున నెలకు సుమారు రూ.4 కోట్ల వరకూ ఈ విధంగా మింగేస్తున్నారని అంచనా. ఇందులో పోలీసు, రెవెన్యూ, ఏలేరు ఇరిగేషన్ శాఖల పరిధిలోని వివిధ స్థాయిల్లో అందరికీ కలిపి రూ.20 లక్షల చొప్పున ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణవరంలో టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేత కనుసన్నల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. తన వెనుక ముఖ్య నేత ఉన్నారని, ఎవరికి చెప్పుకున్నా తమకు పోయేదేమీ లేదని ఆ ద్వితీయ శ్రేణి నేత బెదిరింపులకు దిగుతున్నారు.
ఏలేరు జలాలతో కిర్లంపూడి, ఏలేశ్వరం, పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి తదితర మండలాల పరిధిలో సుమారు 60 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగున్నరేళ్ల పాటు ఖరీఫ్, రబీ సీజన్లలో రెండు పంటలకూ పుష్కలంగా సాగు నీరందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితి తలకిందులైంది. అధికార పార్టీ నేతల అండదండలతో బరితెగించిన ఇసుక మాఫియా.. ఏలేరు పరీవాహక ప్రాంతాలకు గుండె కోతను మిగులుస్తోంది. రబీ సాగును ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. ‘పచ్చ’ మాఫియా విచ్చలవిడిగా సాగిస్తున్న తవ్వకాలతో ఉన్న నీరు కూడా ఆయకట్టుకు సక్రమంగా అందని దుస్థితి ఏర్పడింది.
కృష్ణవరంలో ‘పచ్చ’ మాఫియా
ఏలేరుకు నిట్టనిలువునా తూట్లు
20 నుంచి 30 అడుగుల లోతుకు తవ్వకాలు
ప్రతి నెలా రూ.4 కోట్ల పైనే అక్రమార్జన
రెండో పంటకు నీరు ప్రశ్నార్థకం
చర్యలు తీసుకుంటాం
ఏలేరు కాలువలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. సిబ్బంది క్షేత్ర స్థాయి కి వెళ్లి, ఎక్కడెక్కడ ఇసుక తవ్వుతున్నారో పరిశీలించేలా చర్యలు తీసుకుంటాం. స్థానికంగా వీఆర్‌ఓ లేకపోవడంతో కొంత ఇబ్బంది ఉంది. ఈ తవ్వకాలపై విచారణ చేపట్టి బాధితులపై చర్యలు తీసుకుంటాం.
– జె.చిరంజీవి, తహసీల్దార్, కిర్లంపూడి
గండ్లు పడే ప్రమాదం
ఏలేరు కాలువ నుంచి అక్రమంగా ఇసుకను తరలించడంతో వరదలు వచ్చినప్పుడు గట్లకు గండ్లు పడే ప్రమాదముంది. వరద నీటితో పంట పొలాలు మునిగిపోతాయి. కాలువలో పెద్ద పెద్ద గోతులు తవ్వడంతో దిగువ పంట పొలాలకు తరచూ సాగునీటి ఎద్దటి ఏర్పడి, రబీ సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. దీనిపై ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్, సిబ్బంది దృష్టి సారించాలి. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలి.
– అల్లు శివరామకృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు, గోనేడ, కిర్లంపూడి మండలం
ఇసుక భారీగా తరలిపోతోంది
శృంగరాయునిపాలెం బెడ్ రెగ్యులేటర్ సమీపంలో అక్రమంగా ఇసుక తవ్వి పెద్దపెద్ద లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నారు. ముఖ్యంగా పడవలపై తీసుకుని వచ్చిన ఇసుక వెలికితీత యంత్రాలతో పెద్దపెద్ద గోతులు పెడుతున్నారు. దీంతో పంటల సాగుకు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రామంలో నుంచి ట్రాక్టర్లు అతివేగంగా వెళ్తున్నాయి. దీంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోననే భయాందోళనకు గురవుతున్నాం.
– గరగా పెద్దకాపు, మాజీ మార్కెట్ డైరెక్టర్, శృంగరాయునిపాలెం, కిర్లంపూడి మండలం
Comments
Please login to add a commentAdd a comment