లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,72,410, పూజా టికెట్లకు రూ.1,73,630, కేశఖండన శాలకు రూ.10,640, వాహన పూజలకు రూ.4,150, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.90,632, విరాళాలు రూ.1,35,553 కలిపి మొత్తం రూ.5,87,015 ఆదాయం సమకూరిందని వివరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను ఈఓతో కలసి తాండవ షుగర్స్ మాజీ చైర్మన్ సుర్ల లోవరాజు ప్రారంభించారు.
ఏలేరులో తగ్గిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు తగ్గాయి. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, ఆదివారం 83.10 మీటర్లుగా నమోదైంది. జలాశయం సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, 17.56 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు 1,100, విశాఖకు 200, తిమ్మరాజు చెరువుకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రశాంతంగా రేషన్ డీలర్ల పరీక్ష
కాకినాడ సిటీ: జిల్లాలోని 21 మండలాల్లో ఖాళీగా ఉన్న 146 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పోస్టులకు మొత్తం 709 మంది దరఖాస్తు చేయగా.. మూడు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 654 మంది హాజరయ్యారు.
● కాకినాడ డివిజన్‌లోని 10 మండలాల్లో 96 ఖాళీలకు 584 మంది దరఖాస్తు చేశారు. వీరికి కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీఆర్ జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహించారు. 535 మంది హాజరయ్యారు. పరీక్షను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ ఆర్‌డీఓ ఎస్.మల్లిబాబు పరిశీలించారు.
● పెద్దాపురం డివిజన్‌లోని 11 మండలాల్లో 50 రేషన్ డీలర్ల ఖాళీలకు 125 మంది దరఖాస్తు చేశారు. వీరికి పెద్దాపురం ఎంఆర్ డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించారు. 119 మంది హాజరయ్యారు. ఈ కేంద్రాన్ని ఆర్‌డీఓ కె.శ్రీరమణి తనిఖీ చేశారు.
విఘ్నేశ్వరుని ఆలయానికి
భక్తుల తాకిడి
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివా రం భక్తులతో పోటెత్తింది. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వా మికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. మహానివేదన అనంతరం స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించారు.
Comments
Please login to add a commentAdd a comment