రోడ్డు భద్రతపై ఫోకస్
●
● విస్తృతంగా అవగాహన సదస్సులు
● ప్రమాదాల నివారణకు సూచనలు
● ఫిబ్రవరి 15 వరకూ రవాణా శాఖ కార్యక్రమాలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రహదారి భద్రతపై రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. పోలీస్, ఆర్‌అండ్‌బీ, వైద్య, ఆరోగ్యం తదితర శాఖల సమన్వయంతో దీనిని విజయవంతం చేసేందుకు కృషి చేస్తోంది. గతంలో ఏడాదికి ఒక పర్యాయం జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. గత ఏడాది నుంచి దీనిని రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నెల రోజుల పాటు కొనసాగిస్తున్నారు. ఈ మాసోత్సవాల సందర్భంగా రహదారి భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే ఈ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శని, ఆదివారాల్లో జాతీయ రహదారులపై లారీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం వైద్య శిబిరం నిర్వహిస్తారు. ఈ 21న జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించి జాతీయ, రాష్ట్ర రహదారులపై గుర్తించిన బ్లాక్‌స్పాట్లలో వచ్చే ఏడాదికల్లా ప్రమాదాలను నివారించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. రహదారులపై ప్రమాదకర స్పాట్ల వద్ద చేపట్టాల్సిన చర్యలపై సమీక్షిస్తారు. ఈ నెల 22, 23 తేదీల్లో విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 24, 25న తేదీల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో వాకథాన్ నిర్వహించాలని నిర్ణయించారు. హెల్మెట్ ధారణపై 27, 28 తేదీల్లో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తారు. ర్యాలీ నిర్వహిస్తారు. హెల్మెట్ వాడకంపై 29న మహిళలకు అవగాహన కల్పిస్తారు. ఈ నెల 30న గుడ్ సమ్మరిటన్ ప్రోగ్రామ్‌పై ప్రచార కార్యక్రమం చేపడతారు. 31న అంబులెన్స్ డ్రైవర్లకు గుడ్ సమ్మరిటన్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తారు. ఫిబ్రవరి 1న గూడ్స్, ట్యాంకర్లు, ఫైర్ వెహికల్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు చేపడతారు. 2న రహదారి భద్రతపై కార్యక్రమం జరుగుతుంది. 3న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. 4న డ్రైవింగ్ స్కూల్స్, డీలర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రహదారి భద్రతపై 6న సెమినార్ జరుగుతుంది. వాష్ అండ్ గో ప్రోగ్రామ్‌లో భాగంగా 7వ తేదీ అర్ధరాత్రి వాహనాలు ఆపి, డ్రైవర్లు ముఖం కడుక్కునేలా చేసి, టీ అందిస్తారు. 8 ఎన్‌ఫోర్స్‌మెంట్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఉంటుంది. ఇంజినీరింగ్ కళాశాలల ప్రొఫెసర్లు, జాతీయ, రాష్ట్ర రహదారుల అధికారులతో 9న అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. 10, 11, 12 తేదీల్లో ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో వర్క్‌షాపు జరుగుతుంది. జాతీయ రహదారుల ధాబాల వద్ద 13, 14 తేదీల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. 15వ తేదీన రక్తదాన శిబిరం, మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జరుగుతుంది. వలంటీర్లు, నిర్వాహకులకు బహుమతులు అందిస్తారు.
ప్రమాదాల నివారణే లక్ష్యం
ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ షెడ్యూల్ రూపొందించి, అన్ని వర్గాల వారినీ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. పెద్దాపురం, కత్తిపూడి యూనిట్ల అధికారులకు షెడ్యూల్ కేటాయించాం.
– కె.శ్రీధర్, జిల్లా రవాణా అధికారి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment