రత్నగిరి.. భక్తఝరి
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● 1,800 వ్రతాల నిర్వహణ
● రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుడిని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి పూజలు చేశారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా స్వామివారి సన్నిధికి తరలివచ్చారు. పండగలకు స్వస్థలాలకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమై, మార్గం మధ్యలో సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామిని దర్శించుకున్నారు. అధిక శాతం భక్తులు కార్లు, ఇతర వాహనాల్లో రావడంతో దేవస్థానంలోని పార్కింగ్ స్థలాలన్నీ నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని సుమారు 40 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదా పథకంలో సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
ఘనంగా రథసేవ
ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి టేకు రథంపై వేంచేయించారు. పూజల అనంతరం రథసేవను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళవాయిద్యాల ఘోష నడుమ రథంపై ఆల య ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించా రు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
నేడు ముత్తంగి సేవ
సత్యదేవుడు, అమ్మవారిని సోమవారం ముత్యాల కవచాలతో (ముత్తంగి సేవ) అలంకరిస్తారు. ఏడాది నుంచి స్వామివారికి ప్రతి సోమవారం ముత్తంగి సేవ, గురువారం నిజరూపదర్శన సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment