ఎన్టీఆర్ జలకిరికిరి
● పేరు మార్పుతో సరి..
● రైతులకు ‘జల్’ కొట్టిన కూటమి సర్కార్
● ‘ఎన్టీఆర్ జలసిరి’గా మారిన
‘వైఎస్సార్ జలకళ’
● ఏడు నెలల్లో ఒక్క బోరూ లేదు
● అన్నదాతలకు తప్పని నీటి కష్టాలు
● పట్టించుకోని పాలకులు
పిఠాపురం: కేవలం వర్షాధారంగానే సాగు జరిగే మెట్ట ప్రాంతంలో పైరు పచ్చగా ఉండాలంటే పాతాళగంగే ఆధారం. దానిని పైకి తీసుకుని వచ్చి.. పంట చేలను తడపాలంటే బోర్లు వేసి తోడటమే ప్రస్తుతం రైతుకు ఉన్న ఏకై క మార్గం. అయితే, దీనికయ్యే పెట్టుబడి అన్నదాతకు తలకు మించిన భారమే అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అటువంటి రైతులను ఆదుకునే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకం రూపొందించి, పక్కాగా అమలు చేసింది. చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ ఉచిత బోరు బావుల పథకాన్ని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2020 సెప్టెంబర్ 28న ప్రారంభించారు. నీటి ఎద్దడి అధికంగా ఉండే మెట్ట ప్రాంత భూముల్లో ఉచితంగా బోర్లు వేసి, రైతుల సాగునీటి కష్టాలు తీర్చారు. తద్వారా వర్షం పడితేనే కానీ పంటలు సాగు చేయలేని రైతులకు ఏడాదికి మూడు పంటలు పండించుకునే అవకాశం కల్పించారు.
వైఎస్సార్ సీపీ పాలనలో ఇలా..
ఈ పథకం కింద గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా 3,118 దరఖాస్తులు రాగా.. 1,326 ధ్రువీకరణ పొందాయి. వీటిలో పరిపాలనా ఆమోదం 1,306 పొందగా.. అత్యధిక అవసరమున్న రైతులకు సుమారు రూ.15 కోట్లతో 926 బోర్లు ఉచితంగా వేశారు. కేవలం భూగర్భ జలాల పైనే ఆధారపడి సాగు చేస్తున్న వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చి, యుద్ధప్రాతిపదికన బోర్లు మంజూరు చేశారు. ఇలా వేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్ వేయించుకున్న రైతులకు ప్రత్తిపాడు, కాకినాడ, కత్తిపూడి క్లస్టర్ల పరిధిలో 99 మోటార్లు ఉచితంగా అందజేశారు. మిగిలిన రైతులకు బోర్లు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇలా గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం మూడు ఎకరాలు.. ఆరు పంటలుగా సాగింది.
కూటమి ప్రభుత్వ హయాంలో ఇలా..
ఈ పరిస్థితుల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాధినేతలు రైతు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అన్నదాతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గడచిన ఏడు నెలల్లో తుంగలో తొక్కేయడంతో పాటు.. అప్పటి వరకూ అమలవుతున్న పథకాలను కూడా అటకెక్కించేశారు. ఇందులో భాగంగానే వైఎస్సార్ జలకళ పథకాన్ని కూడా నీరుగార్చేశారు. ఎన్టీఆర్ జలసిరిగా ఈ పథకం పేరు మార్చి, అక్కడితో చేతులు దులుపేసుకున్నారు. కనీసం పథకం విధివిధానాలను కూడా నిర్ణయించలేదు. బంగాళాఖాతంలో తుపానులు ఏర్పడితే తప్ప ఈ సీజన్‌లో పెద్దగా వర్షాలుండవు. మరోవైపు జలాశయాల ద్వారా సాగునీరు కూడా పూర్తి స్థాయిలో అందే పరిస్థితి ఉండదు. దీంతో జిల్లాలోని రబీ రైతులు సాగునీటి ఎద్దడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఉచిత బోర్లు పథకం అమలు చేస్తే తమకెంతో మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. కానీ, ప్రభుత్వం ఈ పథకంపై నిర్లక్ష్యం చూపుతూండటంతో బోరు బావులు పూర్తి స్థాయిలో లేక పంట చేలు నెర్రెలు తీస్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉచిత బోర్ల పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
వెంటనే అమలు చేయాలి
ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆయన ఆశయాలను పాతాళంలోకి తొక్కేస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం తప్ప అమలు చేయడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి రైతులకు అన్యాయం చేస్తున్నారు. దీంతో అన్నదాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని వెంటనే అమలు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
– తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అద్యక్షుడు, కాకినాడ
అమలులో లేదు
భూగర్బ జలాలతో పంటలు పండించుకునే రైతులకు బోరు బావులతో సాగునీటి భరోసా కల్పించేలా ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ పథకం ప్రస్తుతం అమలులో లేదు. ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. పథకం అమలులో లేకపోవడంతో రైతుల నుంచి ఎటువంటి దరఖాస్తులూ తీసుకోవడం లేదు.
– అడపా వెంకటలక్ష్మి, ప్రాజెక్టు డైరెక్టర్,
జిల్లా నీటి యాజమాన్య సంస్థ, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment