రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
తుని: రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందువల్లనే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. తొండంగి మండలం బెండపూడికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త, వృద్ధుడు మల్ల రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. దీంతో అతడిని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కార్యకర్తలతో కలిసి ఆసుపత్రికి వెళ్లి రాంబాబును దాడిశెట్టి రాజా పరామర్శించారు. రాంబాబుపై దాడిని ఖండిస్తున్నామని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాంబాబు కుటుంబానికి అండగా ఉంటామని రాజా భరోసా కల్పించారు.
ఫిబ్రవరి 24 నుంచి
మహాశివరాత్రి ఉత్సవాలు
సామర్లకోట: పంచారామ క్షేత్రమైన సామర్లకోట బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి ఒకటోల తేదీ వరకూ మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. స్థానిక విలేకర్లతో గురువారం ఆయన మాట్లాడారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు ఆలయ ఆవరణలో భక్తులతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి స్వామి వారి కల్యాణం, 26న మహాశివ రాత్రి, 27న రథోత్సవం, మార్చి 1న స్వామి వారి శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై భక్తుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఆలయానికి నిత్యం వచ్చే భక్తులు ఈ సమావేశానికి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈఓ కోరారు.
రెచ్చిపోయిన మట్టి మాఫియా
మట్టి ట్రాక్టర్లను అడ్డుకున్న వీఆర్వోపై దౌర్జన్యం
గోకవరం: మండలంలోని కామరాజుపేటలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మట్టి ట్రాక్టర్లను అడ్డుకున్న వీఆర్వోపై మట్టి ట్రాక్టర్ డ్రైవర్లు దౌర్జన్యానికి దిగారు. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామ శివారున పంట పొలాల నుంచి ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్లతో మట్టిని వెలికితీసి సమీపంలోని లే అవుట్‌కు తరలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న స్థానిక వీఆర్వో ధర్మరాజు అక్కడకు చేరుకుని, మట్టి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్లు వీఆర్వోపై దౌర్జన్యానికి దిగారు. అడ్డు తప్పుకోకపోతే ట్రాక్టర్‌తో ఢీకొట్టి వెళ్లిపోతామని బెదిరింపులకు దిగారు. వీఆర్వో ఒక్కరే ఉండటంతో వారు మట్టి ట్రాక్టర్లను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై తహసీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
26న చదరంగం పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): సెకండ్ వరల్డ్ చెస్ అకాడమీ ఆధ్వర్యాన ఈ నెల 26న జిల్లా స్థాయి చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు జంజం సాయికుమార్ గురువారం తెలిపారు. కాకినాడ సూర్య కళా మందిరంలో అండర్–7, 9, 11, 13, 15 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు రూ.300 రిజిస్ట్రేషన్ రుసుం చెల్లించాలని తెలిపారు. టోర్నీలో పాల్గొనే వారికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. వివరాలకు 95781 99777, 90101 50640 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
లండన్ జాబ్ పేరిట
రూ.12 లక్షలకు టోకరా
కాకినాడ క్రైం: లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. కాకినాడ వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక జగన్నాథపురానికి చెందిన కె.దశరథుడు కుమారుడు వర్మ బీటెక్ పూర్తి చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన హర్షవర్ధన్‌తో దశరథుడికి కొన్నాళ్లుగా పరిచయం ఉంది. ఈ క్రమంలో వర్మకు లండన్‌లో ఉద్యోగం వేయిస్తానని హర్షవర్ధన్ నమ్మబలికి, 2023లో దశరథుడి నుంచి రూ.12 లక్షలు తీసుకున్నాడు. అప్పటి నుంచీ రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నాడు. తాము మోసపోయామని గ్రహించిన దశరథుడు తమ డబ్బు తిరిగివ్వాలని అడిగాడు. అయితే హర్షవర్ధన్ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment