చదువును చాలించకూడదని..!
ఐ.పోలవరం: విద్యార్థులంతా తాము చదువుకునే పాఠశాలకు నిత్యం గోదావరి నదీపాయ దాటి వస్తుంటారు. సముద్ర సంగమ ప్రాంతం దగ్గర కావడం వల్ల పోటు, పాటు సమయంలో ఇక్కడ నదీపాయల్లో నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పటికీ చదువుపై మక్కువతో వారు పడవలపై వస్తున్న విషయాన్ని గుర్తించిన జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వారికి గురువారం లైఫ్ జాకెట్లు అందజేశారు.
ఐ.పోలవరం మండలం జి.మూలపొలం ఉన్నత పాఠశాలకు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి నిత్యం 95 మంది విద్యార్థులు వస్తుంటారు. వీరంతా ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్నారు. వీరిలో అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందినవారే అధికం. గోదావరికి పోటు సమయంలో వీరి కష్టాలను చూసిన పాఠశాల హెచ్‌ఎం కొమ్మన జనార్దనరావు ఇదే విషయాన్ని వాట్సప్ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషాకు వివరిస్తూ తమ విద్యార్థులకు లైఫ్ జాకెట్లు అందించి రక్షణ కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన డీఈవో ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్ వివరించారు. దీనికి స్పందించిన రెండు మూడు రోజుల్లో 95 మంది విద్యార్థులకు ‘లైఫ్’ జాకెట్లు అందజేశారు. అలాగే స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సైతం లైఫ్ జాకెట్లు ఇప్పించాలని అక్కడ హెచ్‌ఎం కోరడంతో వారికి కూడా వాటిని అందజేశారు.
ఫలించిన ఉపాధ్యాయుని ప్రయత్నం
వాట్సప్ సందేశానికి విశేష స్పందన
సహకరించిన డీఈఓ..
స్పందించిన కలెక్టర్
విద్యార్థులకు లైఫ్ జాకెట్ల అందజేత
Comments
Please login to add a commentAdd a comment