బల్దియాలో ఇంటి దొంగలపై విచారణ
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి బల్దియాలో మాయమై న పాత సామాగ్రి ఘటనపై మున్సిపల్ అధికారులు విచారణ జరిపించి, నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి బల్దియాకు సంబంధించిన పాత సామగ్రిని కొందరు వ్యక్తులు ఈనెల 10వ తేదీన రాత్రి అక్రమంగా లారీలో తరలించారు. ఈ విషయం తెలియడంతో పలువురు కౌన్సిలర్లు బల్దియా కమిషనర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ స్పందన మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారి(డీఈ) వేణుగోపాల్‌తో విచారణ జరిపించారు. ఆయన ఎఫ్‌బీవో శ్యామ్‌తో కలిసి ఈనెల 20, 21వ తేదీలలో విచారణ జరిపారు. రూ. లక్షలు విలువ చేసే పాత సామగ్రి స్థానంలో రూ. 20 వేలు కూడా విలువ చేయని మున్సిపాలిటీకి సంబంధం లేని సామగ్రిని తెచ్చిపడేసిన విషయాన్ని డీఈ గమనించకుండా సామగ్రి ఉందని భావించారు. అయితే మాయమైన పాత సామగ్రి స్థానంలో బల్దియాకు సంబంధంలేని తుక్కును పడేశారన్న విషయంపై ‘బల్దియాలో ఇంటి దొంగలు’ శీర్షికన ఈనెల 22వ తేదీన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఇది కామారెడ్డి పట్టణంలో చర్చనీయాంశమైంది. దీంతో మళ్లీ విచారణ జరిపిన డీఈ.. పాత సామగ్రి మాయమైన వ్యవహారంలో ప్రధాన పాత్ర ఎఫ్‌బీవో శ్యామ్‌దేనని గుర్తించారు. మొదట విచారణ జరిపిన సమయంలో డీఈ వెంట ఎఫ్‌బీవోను చూసిన కార్మికులు సరైన సమాచారం చెప్పలేకపోయారని భావిస్తున్నా రు. డీఈ విచారణ నివేదిక ఆధారంగా ఎఫ్‌బీవో శ్యామ్‌కు మెమో జారీ చేశారు. ఆ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎఫ్‌బీవో శ్యామ్ సంజాయిషీని లిఖితపూర్వకంగా ఇచ్చారు.
సాక్షులకు బెదిరింపులు?
పాత సామగ్రి మాయంపై
విచారణ జరిపిన డీఈ
కలెక్టర్‌కు నివేదించిన కమిషనర్
ఎఫ్‌బీవోకు మెమో జారీ
‘సాక్షి’ కథనంతో కదలిక
మున్సిపాలిటీకి చెందిన పాత సామగ్రిని లారీలో తీసుకెళ్లిన రోజు విధుల్లో ఉన్న ఓ రెగ్యులర్ ఉద్యోగితో పాటు మరో కార్మికుడిని కొందరు బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఘటన గురించి ఎవరికీ చెప్పవద్దని భయపెట్టినట్లు సమాచారం. కాగా మాయమైన పాత సామగ్రి విలువ రూ. 15 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. గడి ట్యాంక్ వద్ద నుంచి రెండు గదుల్లో ఉన్న ఒక్కొక్కటి క్వింటాలుకు పైగా బరువున్న వాల్వ్‌లు, పైపులు, చేతి పంపులు, తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా మున్సిపల్ సామగ్రిని ఎత్తుకెళ్లిన ఘటనలో తన ప్రమేయం లేదని, అందరు కలిసి తనను ఇరికించాలని చూస్తున్నారని ఎఫ్‌బీవో శ్యామ్ పేర్కొంటున్నారు. పోలీసులు, ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని కోరుతున్నారు. బల్దియాకు సంబంధించిన పాత సామగ్రిని ఎవరు తరలించారన్న విషయం తెలియాల్సి ఉందని మున్సిపల్ కమిషనర్ స్పందన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కింది స్థాయి అధికారులతో కాకుండా ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment