త్వరలో ‘భూ భారతి’
● భూ సమస్యల పరిష్కారం
దిశగా చట్టం రూపకల్పన
● త్వరలో అమలులోకి నూతన చట్టం
● ఇన్నాళ్లూ ధరణితో అనేక తిప్పలు
కామారెడ్డి క్రైం: రాష్ట్రంలో త్వరలో భూ భారతి చట్టం అమలులోకి రానుంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్ కారణంగా లక్షల సంఖ్యలో రైతులు తమ రికార్డుల విషయంలో నానా అవస్థలు పడ్డారు. ఇప్పటికీ పడుతునే ఉన్నారు. ధరణిలో దొర్లిన తప్పిదాలను సరిచేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా కూడా ఆప్షన్‌లు అందుబాటులో లేక సమస్యలకు పరిష్కారాలు దొరకడం లేదు. తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన హామీ ప్రకారం ధరణి స్థానంలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేసింది. భూ భారతి పేరుమీద తీసుకువస్తున్న ఈ చట్టానికి గవర్నర్ ఆమోదం ఇటీవల ఆమోదం తెలిపారు. అనేక రకాల భూ సమస్యలకు పరిష్కారాలు భూ భారతి చట్టంతో లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇకనైనా తమ భూ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని రైతులు గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు.
మరికొన్ని ప్రధాన అంశాలు
ధరణిలో ఎదురైన తప్పులను సవరించడానికి చాలా మట్టుకు ఆప్షన్‌లు లేవు. చాలా మందికి కొత్త పాస్‌పుస్తకాలు కూడా రాలేవు. ఇవి కాకుండా వేల సంఖ్యలో పార్ట్‌బి కేసులు ఉన్నాయి. వీటన్నింటికి దాదాపు ఆరేళ్లుగా పరిష్కారాలు దొరకడం లేదు. నూతన చట్టంలో ఇలాంటివి అన్ని పరిష్కారమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం చట్టం ద్వారా తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌లకు అధికారాలను కేటాయించనున్నారు. భవిష్యత్తులో భూ వివాదాలకు అస్కారం లేకుండా పకడ్బందీగా సర్వే చేయించి ప్రతి మ్యూటేషన్‌కు కూడా మ్యాప్ తప్పనిసరి చేయనున్నారు. భవిష్యత్తులో గొడవలు రాకుండా వారసత్వ భూములకు పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాతనే పాస్ పుస్తకాలు ఇస్తారు. ఈ చట్టం ద్వారా సాదాబైనామాలకు కూడా మోక్షం లభించనున్నట్లు తెలుస్తోంది. గ్రామకంఠం, అబాదీ పరిధిలో ఉండే స్థలాలకు కూడా రికార్డు హక్కులను కల్పించనున్నారు. జిల్లా స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం కల్పించే విధంగా రెండు అంచెల అప్పీల్ వ్యవస్థతో ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేయనున్నారు. కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ద్వారా భూ తగాదాలను, సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
అనేక సమస్యలు
ప్రస్తుతం ఉన్న ధరణి పోర్టల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతనే కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. అప్పుడే రికార్డులన్నింటిని చట్టం కింద ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ధరణి వచ్చినప్పుడు రికార్డులను అందులో ఎక్కించడానికి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని 2018లో అప్పటి ప్రభుత్వం నిర్వహించింది. రెవెన్యూ అధికారులకు తక్కువ సమయాన్ని నిర్దేశించి వెంటనే రికార్డులను ఆన్‌లైన్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. రాత్రింబవళ్లు అధికారులు రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు పనులు చేశారు. దీంతో అనేక తప్పిదాలు దొర్లాయి. డమ్మీ ఖాతాలు, పార్ట్‌బి కేసులు, రైతుల పేర్లు, శివారు, సర్వే నెంబర్, విస్తీర్ణం, భూమి రకం లాంటి అనేక వివరాలు తప్పుగా నమోదయ్యాయి. జిల్లాలోనే ఇలాంటి కేసులు దాదాపు 20 నుంచి 30 వేల వరకు ఉంటాయి. అప్పటి నుంచి పరిష్కారం కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
అనుభవదారు కాలమ్
తెలంగాణ భూ భారతి ‘2024’ బిల్లును డిసెంబర్ 20న అసెంబ్లీలో అమోదించారు. ముఖ్యంగా ఇందులో పలు మార్పులు తీసుకువచ్చారు. ధరణి వెబ్‌సైట్ వచ్చేకంటే ముందు మ్యానువల్‌గా ఉండే అన్ని రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారు కాలమ్ ఉండేది. ధరణి వచ్చాక ఈ కాలమ్‌ను తొలగించారు. భూ భారతిలో అనుభవదారు కాలమ్‌ను మళ్లీ చేర్చనున్నారు.
తొందర్లోనే అందుబాటులోకి..
ప్రభుత్వం కొత్తగా తీసుకు వస్తున్న భూ భారతి చట్టానికి ఇటీవలే ఆమోదం లభించింది. తొందర్లోనే వెబ్‌సైట్ ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భూ భారతి వచ్చిన తర్వాత అనేక సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. అమల్లోకి రాగానే ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు చట్టం ప్రకారం పరిష్కరిస్తాం.
– మసూర్ అహ్మద్, ఏవో, కలెక్టరేట్, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment