సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అడ్లూర్ చెరువులో ముగ్గురు చనిపోయిన కేసు మిస్టరీ వీడటం లేదు. ఎస్సైతో పాటు మహిళా కానిస్టేబుల్ మరో యువకుడు అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో మునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఘటన జరిగి మూడు వారాలు గడిచినా మిస్టరీ వీడడం లేదు. ఈ కేసులో సాక్ష్యులు లేరు. నేరస్తులు లేరు. బాధితులూ లేకపోవడంతో పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. ఆ ముగ్గురు ఎందుకు చనిపోయారన్న దానికి సంబంధించి సరైన ఆధారాలు దొరక్కపోవడంతోనే కేసు కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. సాంకేతిక ఆధారాలే కీలకంగా మారడంతో ముగ్గురికి సంబంధించిన ఫోన్లలో దొరికే డాటా కోసం సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
అందులో కూడా కేసును ముందుకు తీసుకు వెళ్లేందుకు కావాల్సిన ఆధారాలు లేవని తెలుస్తోంది. గత నెల 25న భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ శృతి, అదే గ్రామానికి చెందిన నిఖిల్ సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో చనిపోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో పరిశీలించారు. కేసును త్వరితగతిన తేల్చాలని భావించినా సరైన ఆధారాలు దొరక్కపోవడంతో సాంకేతిక అంశాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఘటన జరిగిన ప్రాంతంలో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎటూ తేల్చలేని పరిస్థితి ఏర్పడింది.
సైబర్ ఫోరెన్సిక్ పరీక్షలు
మృతుల ఫోన్‌లో ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అందులో ఇప్పటికే కొంత సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ముగ్గురి మధ్య ఉన్న పరిచయాలు, వాళ్ల మధ్య జరిగిన చాటింగ్, మాట్లాడిన కాల్‌డేటా వివరాలతో నివేదికను రూపొందించి పోలీసు ఉన్నతాధికారులకు పంపించినట్లు సమాచారం. కేసులో ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరూ లేకపోవడం, బాధితులు, నిందితులూ లేకపోవడంతో సైబర్ ఫోరెన్సిక్ పరీక్షల రిపోర్టుతో కేసును కొలిక్క తేనున్నారు. పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం ముగ్గురు నీట మునిగి చనిపోయినట్టు నిర్దారణ అయ్యింది. అలాగే వీరి మరణాలకు ఇతరులెవరూ కారణం కాదని కూడా స్పష్టమైంది. దీంతో కేసులో బలం లేకుండాపోయింది. ఎక్కడో ఒక దగ్గర క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment