ఆలయాల్లో చోరీల ముఠా అరెస్ట్
● రూ.4 లక్షల సొత్తు రికవరీ
● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి
కామారెడ్డి క్రైం: కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ఆలయాలు, ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన నిమ్మలవోయిన సురేష్, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన గణేష్, ఎడపల్లి మండలం తాడెం గ్రామానికి చెందిన గాజుల శ్రీధర్ హౌసింగ్‌బోర్డు ప్రాంతంలో గురువారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో దొంగతనాల వ్యవహారం బయటపడింది. తామే చోరీలకు పాల్పడ్డట్టు వారు అంగీకరించారని ఏఎస్పీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో ఉన్న ఐదుగుడుల ప్రాంగణంలోగల సాయిబాబా ఆలయంలో ఈనెల 10న దొంగలు చొరబడి సౌండ్ బాక్స్, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అశోక్‌నగర్‌తోపాటు భిక్కనూరు, దేవునిపల్లి, ఎడపల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న ఒక్కో ఆలయంలో చోరీలతో పాటు మరికొన్ని చోట్ల ఒక ఆటో, మూడు బైకులు, రెండు చోట్ల మేకల దొంగతనాలు, ఇలా ఈ ముగ్గురూ కలిసి మొత్తం 11 చోరీలకు పాల్పడినట్లు తేలిందని వివరించారు. నిందితులు ముగ్గురూ పాత నేరస్తులు. గతంలో వీరిపై అనేక దొంగతనాల కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి ఆయా కేసుల్లో చోరీ చేసిన మూడు గ్రాముల బంగారం, మూడు బైక్‌లు, ఒక ఆటో, ఏడు జతల వెండి కళ్లు, ట్రాక్టర్ బ్యాటరీ, రెండు మైక్ సెట్‌లు, సెల్‌ఫోన్, ఒక మేకను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వాటి విలువ మొత్తం రూ. 4లక్షలు వరకు ఉంటుందన్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సైలు బాల్‌రెడ్డి, శ్రీరామ్, రాజారామ్, వినయ్ సాగర్, దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బంది విశ్వనాథ్, విజయ్, రాజు, రామస్వామి, అనిల్ రెడ్డి, నరేష్, రవి, నవీన్‌లను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment