సలహా కమిటీ ఏర్పాటులో కాలయాపన
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం నిర్దేశించిన బోర్డు విధి విధానాలు ఖరారు చేయడానికి సలహా కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం, వలస కార్మికుల గోడు వినడానికి ప్రవాసీ ప్రజావాణి, వలస కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో సీట్ల కేటాయింపులు, సలహా కమిటీ ఏర్పాటు చేసి బోర్డు ఆవిర్భావానికి మార్గం సుగమం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సలహా కమిటీలో వలస కార్మికుల సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులకు చోటు దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఏర్పడే సలహా కమిటీ ద్వారానే గల్ఫ్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసే అవకాశం ఉంది. మొదటి నుంచి వలస కార్మికుల సంక్షేమంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సుముఖంగానే ఉంది. ఏకంగా బోర్డును ఏర్పాటు చేయకుండా దశల వారీగానే వలస కార్మికుల వినతులను పరిష్కరిస్తోంది. కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాలలో వలస కార్మికుల కోసం అమలవుతున్న పథకాలను మన రాష్ట్రంలోనూ అందించడానికి ప్రత్యేకంగా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. గల్ఫ్‌బోర్డుతో పాటు ప్రవాసీ విధానం(ఎన్‌ఆర్‌ఐ పాలసీ) అమలు చేస్తే గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉపాధి పొందుతున్న వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏవైనా పథకాలను అందించడానికి అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ అన్ని అంశాలపై అధ్యయనం గతంలో జరిగినా ఈ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సలహా కమిటీని ఏర్పాటు చేసి కమిటీ సూచనలను పాటిస్తామని ప్రకటించింది. సలహా కమిటీని ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో గల్ఫ్ బోర్డు ఆవిర్భావ ప్రక్రియ ఆలస్యమవుతోందని అంటున్నారు.
వలస కార్మికులతో జరిగే లబ్ధిని దృష్టిలో ఉంచుకొని..
వలసల ద్వారానే రాష్ట్రానికి, కేంద్రానికి ఆదాయ మార్గాలు మెరుగవుతున్నాయి. మన రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు సుమారు 15 లక్షల మంది వలస వెళ్లి ఉంటారని అంచనా. సమగ్ర సర్వే వివరాలు వెల్లడైతే గల్ఫ్ దేశాలకు ఎంత మంది వలస వెళ్లి ఉంటారనే సంఖ్య తేలే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల నుంచి వలస కార్మికులు ప్రతి నెలా వారి వేతనం ఇంటికి పంపిస్తుండటంతో రెండు ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతోంది. వలస కార్మికులతో వచ్చే ఆదాయం వల్ల లబ్ధిపొందుతున్న ప్రభుత్వాలు వారి సంక్షేమంపై దృష్టి సారించకపోవడం విచారకరమనే భావన వ్యక్తం చేస్తున్నారు. సలహా కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం సలహా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం
మూడు నెలల క్రితమే ఉత్తర్వులు
కమిటీ సభ్యుల నియామకం కోసం అడుగులు ముందుకు పడని వైనం
సలహా కమిటీని నియమిస్తేనే బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం
Comments
Please login to add a commentAdd a comment