అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి
● జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్
దోమకొండ: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక అధికారులకు సూచించారు. గురువారం చింతమాన్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా పథకాలపై గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని అన్నారు. పథకాలకు దరఖాస్తు చేసుకున్న పలువురితో ఆయన మాట్లాడారు. వారి వివరాలను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ సంజయ్‌రావ్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయాధికారి మణిదీపిక, ఏఈవో కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్, తదితరులున్నారు.
సెపక్ తక్రా జాతీయ
స్థాయి పోటీల్లో పూజిత ప్రతిభ
కామారెడ్డి అర్బన్: హనుమకొండలో ఈనెల 10 నుంచి 14 వరకు నిర్వహించిన సెపక్ తక్రా సీనియర్ మహిళ జాతీయ స్థాయి పోటీల్లో బాన్సువాడకు చెందిన పూజిత ప్రతిభ చూపి రజత పతకం సాధించినట్టు సెపక్ తక్రా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేష్, నరేష్‌లు తెలిపారు. ఈ పోటీల్లో మణిపూర్ జట్టు ప్రథమ స్థానం పొందగా, తెలంగాణ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచిందని వారు పేర్కొన్నారు. పూజిత హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. కామారెడ్డి జిల్లా సెపక్‌తక్రా అసోసియేషన్ తరపున సీనియర్ మహిళ జట్టులో పాల్గొని ప్రతిభ చూపింది.
చైనా మాంజాతో
ఒకరికి గాయాలు
భిక్కనూరు: మండల కేంద్రంలో చైనా మాంజాతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మ్యాదరి సిద్ధరాములు తన బైక్‌పై గురువారం సిద్దరామేశ్వరాలయం రోడ్డు మీదుగా వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఎగురవేసిన పతంగికి సంబందించిన చైనా మాంజా అతని గొంతుకు అడ్డుగా వచ్చి కోసుకుంటూ వెళ్లింది. దీంతో ఆయన గొంతు వద్ద తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స నిర్వహించారు.
కవితను విమర్శించే
స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదు
బాన్సువాడ : ఎమ్మెల్సీ కవితను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని బీఆర్‌ఎస్ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ అన్నారు. గురువారం తన నివాసంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీని ఏ గ్రామంలో పూర్తి స్థాయిలో చేసిందో సమాధానం చెప్పాలని అన్నారు. నాయకులు మోచీ గణేష్, శివ, మౌలాన, గౌస్, సాయిలు, రమేష్‌యాదవ్ తదితరులున్నారు.
ఆలయ హుండీ లెక్కింపు
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆలయంలోని హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపడతామని ఆలయ కమిటీ అధ్యక్షుడు బోషివార్ ప్రకాశ్ తెలిపారు. హుండీలో రూ.18వేల830 నగదు, వెండి వస్తువులు వచ్చినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన కార్యదర్శి గంగాధర్, భక్తులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment