‘రైతుభరోసా’ అర్హులను తేల్చేందుకు.. ● జిల్లాలో 104 బృందాల ఏర్పాటు
ఎల్లారెడ్డి : ఎన్నోరోజులుగా రైతులను ఊరిస్తూ వస్తున్న రైతుభరోసా పథకం అమలుకు రాష్ట్రప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 26నుంచి పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. గతంలోలాగా కాకుండా సాగు భూములకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. దీంతో సర్కారు ఆదేశాల మేరకు వ్యవసాయానికి అనువైన భూములను గుర్తించేందుకు అధికారులు సర్వే చేపట్టారు. సర్వే గురువారం ప్రారంభమైంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సాగుకు యోగ్యమైన భూములను గుర్తిస్తున్నారు. వ్యవసాయానికి అనువు కాని వెంచర్లు, గోదాములు, రోడ్లు, రాళ్లు రప్పలు, గుట్టలతో నిండిన సాగుకు పనికి రాని భూములు, నివాస ప్రాంతాలను రైతు భరోసా నుంచి మినహాయించేందుకు అధికారులు పకడ్బందీ సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో సేద్యానికి పనికి రాని భూములను గుర్తించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) క్లస్టర్ల వారీగా 104 బృందాలను ఏర్పాటు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ బృందంలో మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయశాఖ అధికారి గ్రామ స్థాయిలో ఏఈవోతో పాటు, డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సభ్యుడిగా ఉన్నారు. వీరు సర్వే నంబర్ల వారీగా భూములను పరిశీలిస్తూ వ్యవసాయానికి అనువైన, అనువుకాని భూములను గుర్తిస్తున్నారు. జిల్లాలో గతంలో 5,24,460 ఎకరాలకు రైతుబంధు పథకం వర్తించింది. అయితే సర్వేలో అధికారులు పంటలు వేసిన భూములే కాకుండా నీటి సదుపాయం లేని కారణంగా పంటలు వేయని భూములను కూడా సేద్యానికి అనువైనవిగానే గుర్తించాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. ఈ భూముల్లో ఈ సీజన్‌లో పంటలు వేయకపోయినా రైతు భరోసా అందే అవకాశాలున్నాయి. వెంచర్లు, నివాస ప్రాంతాలు, కోళ్లఫాంలు, గోదాములులాంటి పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తున్న భూములు, రాళ్లు రప్పలతో నిండిన బంజరు భూములు లాంటి సేద్యానికి పనికిరాని భూములను మాత్రం మినహాయించనున్నారు. సర్వే పూర్తయ్యాక ఇందులోనుంచి సుమారు 40 వేల ఎకరాలకు రైతుభరోసా దక్కకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
21 నుంచి గ్రామ సభలు
ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సర్వే పూర్తయిన అనంతరం అధికారులు ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ పంచాయితీల వారీగా గ్రామ సభలు నిర్వహించి వ్యవసాయానికి అనువు కానివి అని గుర్తించిన భూముల వివరాలు బహిరంగంగా ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. గ్రామసభల అనంతరం 25న రైతు భరోసాకు అర్హత కలిగిన భూముల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఆన్‌లైన్‌లో నమోదైన వివరాల ప్రకారం ఈనెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment