దగాపడ్డ రైతులు
మోర్తాడ్: పంట పొలాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను అందించడానికి కాళేశ్వరం పథకంలో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 21 పనులు సాగకపోవడంతో.. ఈ పథకం కోసం కేటాయించిన పైపులను దళారులు పక్కదారి పట్టించారు. ప్యాకేజీ పనులు పూర్తి చేయడానికి టెండర్ దక్కించుకున్న కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో పోలీసు యంత్రాంగం స్పందించింది. పైపుల రికవరీపై దృష్టి సారించింది.
మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలాల్లోని వివిధ గ్రామాల చెరువుల వద్ద ఆరేళ్ల కింద పైపులను వేశారు. ప్యాకేజీ 21కి సంబంధించిన ప్రధాన పైప్‌లైన్ పనులు పూర్తి చేసినా పంట పొలాలకు సాగునీటిని అందించడానికి డిస్ట్రిబ్యూటరీ పైపులు వేయాల్సి ఉంది. ప్రతి ఎకరాకు సాగునీటి ని అందించడానికి పంట పొలాల మధ్య పైప్‌లైన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.750 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఈ మేరకు నిధులను మంజూరు చేయగా టెండర్ ప్రక్రియ ఎప్పుడో పూర్తి అయ్యింది. రైతులు ప్రతి సీజనులో పంటలను సాగు చేస్తూ ఎప్పుడు కూడా వ్యవసాయ క్షేత్రాలకు విరామం ఇవ్వకపోవడంతో ప్యాకేజీ పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. నీటిపారుదల శాఖ అధికారులు చర్చలు జరిపినా ప్యాకేజీ పనులు చేయడానికి కాంట్రాక్టు కంపెనీకి రైతులు సహకరించలేదు. ఫలితంగా డిస్ట్రిబ్యూటరీ పైప్‌లు అలాగే ఉండిపోయాయి. తిమ్మాపూర్ శివారులోని రాంసాగర్ చెరువు, వడ్యాట్‌లోని ఒక చెరువు, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలాల్లోని వివిధ గ్రామాలలో నిలువ ఉంచిన పైపులను దళారులు రైతులకు విక్రయించుకున్నారు. ఒక్కో పైప్‌కు రూ.5వేల వరకు వసూలు చేయగా పైప్‌లైన్‌ను పంట పొలాల్లో వేయడానికి ఒక్కో పైప్‌కు రూ.1,500 చొప్పున వసూలు చేశారు. పైప్‌లు చోరీకి గురవుతున్నా కంపెనీ ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో 1,200 పైప్‌లు మాయం అయ్యాయి. ప్యాకేజీ పైపులు మాయమైన విషయం కంపెనీ యాజమాన్యానికి ఆలస్యంగా తెలిసింది. వెంటనే స్పందించిన కంపెనీ యాజమాన్యం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అధికార యంత్రాంగం స్పందించి పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. వారం, పది రోజుల నుంచి పైపుల రికవరీ సాగుతోంది. ప్యాకేజీ పనుల పైపులు ఎవరు వినియోగించుకున్నా స్వచ్ఛందంగా పోలీసు స్టేషన్‌కు తరలించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment