మరో ఉద్యమానికి రైతన్న సన్నద్ధం
కామారెడ్డి టౌన్ : గత ప్రభుత్వం 2022 నవంబర్‌లో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మాస్టర్‌ప్లాన్‌తో కామారెడ్డితోపాటు పట్టణ పరిసరాల్లోని ఎనిమిది గ్రామాల పరిధిలోగల సుమారు 2 వేల ఎకరాలకుపైగా రైతుల భూములు, వ్యవసాయేతర భూములు ఇండస్ట్రియల్, గ్రీన్‌జోన్లుగా మారుతుండడంతో రైతులు ఉద్యమ బాట పట్టారు. ఓ రైతు మరణించడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. సుమారు 45 రోజుల పాటు రైతుల పోరాటం సాగింది. రైతులకు మద్దతుగా బీజేపీ కౌన్సిలర్‌లు రాజీనామాలకు సిద్ధమవడం, రైతుల కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం, కుటుంబాలతో కలిసి రైతులు రోడెక్కడం వంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఉద్యమాన్ని విరమించారు.
మళ్లీ తెరపైకి..
2023 జనవరిలో మాస్టర్ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ప్రకటించాయి. కానీ అధికారికంగా ఎలాంటి జీవో విడుదల చేయలేదు. గత మాస్టర్ ప్లాన్‌లో ఉన్నట్లుగా దేవునిపల్లి నిజాంసాగర్ రోడ్డు నుంచి టేక్రియాల్ బైపాస్ వరకు ఇటీవల రోడ్డు వేయడానికి పనులు ప్రారంభించారు. దీంతో బాధిత రైతులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన బాధిత రైతు ఈనెల 13న మున్సిపల్ కార్యాలయం ముందు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాడు. 8 గ్రామాల రైతులు దీక్షలకు మద్దతు తెలిపారు. కలిసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించుకుని నిరాహార దీక్ష చేస్తున్న శ్రీకాంత్‌తో దీక్ష విరమింపజేశారు. ఉద్యమంపై చర్చించేందుకు ఆదివారంనుంచి గ్రామాలవారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారంనుంచి ఈనెల 26వ తేదీ వరకు టేక్రియాల్, అడ్లూర్‌ఎల్లారెడ్డి, అడ్లూర్, లింగాపూర్, పాతరాజంపేట, రామేశ్వరపల్లి, సరంపల్లి, దేవునిపల్లి గ్రామాలలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాలు జరగనున్నాయి. ఆయా సమావేశాలలో మాస్టర్ ప్లాన్‌పై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. సమస్యపై చర్చించేందుకు ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, వెంకటరమణారెడ్డిలతో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలను కలవాలని నిర్ణయించారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు జీవో కోసం రైతులంతా మరో ఉద్యమానికి సన్నద్ధమవుతుండడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అంశంపై అంతటా చర్చ నడుస్తోంది.
మాస్టర్ ప్లాన్ జీవో రద్దు కోసం పోరుబాట
నేటినుంచి గ్రామాలలో సమావేశాలు
భవిష్యత్ కార్యాచరణ
ప్రకటించనున్న జేఏసీ
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ జీవో రద్దు జీవో కోసం రైతులు మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఆదివారంనుంచి గ్రామాలవారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశాల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment