పుట్టిన రోజు వేడుకలకు వచ్చి అనంతలోకాలకు..
ఎడపల్లి (బోధన్): బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహిళ తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఎడపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని అంబర్‌పేట్‌కు చెందిన మచ్చర్ల రజిని(46) ఎడపల్లిలోని బంధువుల ఇంట్లో శనివారం రాత్రి నిర్వహించిన బర్త్‌డే వేడుకలకు హాజరైంది. ఆదివారం నిజామాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు మండల కేంద్రంలోని ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ వద్ద వేచి ఉన్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో రజిని ఘటనాస్థలంలోనే మృతి చెందింది. కారులో ఉన్న జానకంపేట్‌కు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి అక్క లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో వృద్ధుడు..
నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని వివేకానంద చౌరాస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కౌల్‌పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన తమ్మిశెట్టి ఆరోగ్యం (62) అనే వృద్ధుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. చెడిపోయిన తన బైక్‌ను బాగు చేయించేందుకు ఆరోగ్యం నందిపేటకు తీసురుకెళ్లాడు. బైక్‌ను తోసుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కందకుర్తి రవికుమార్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరోగ్యం తలకు బలమైన గాయాలు కాగా ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు తమ్మిశెట్టి సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
లక్ష్మి కాలువలో మత్స్యకారుడు..
బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన శ్రీతేజ(20) చేపల వేటకు వెళ్లి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లక్ష్మి కాలువలో పడి మృతి చెందాడు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ముప్కాల్ ఎస్సై రజినీకాంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీతేజ స్నేహితులతో కలిసి చేపలను వేటాడేందుకు లక్ష్మి కాలువకు వెళ్లాడు. వల వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయాడు. స్నేహితుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు జాలరుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment