అన్నారంలో ఒకరి హత్య
రామారెడ్డి: మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన పొక్కలి రవి(41) అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రవి రోజూలాగే శనివారం రాత్రి ఇంట్లోని మంచంపై పడుకున్నాడు. ఆదివారం లేచి చూసేసరికి పదునైన ఆయుధంతో దుండగులు రవిని పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడి భార్య రంజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రవి హత్యకు ఆస్తి తగాదాలే కారణమని ప్రచారం జరుగుతోంది.
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఖలీల్‌వాడి: నగరంలోని ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన షేక్ జునైద్ అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. షేక్‌జునైద్ శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి తల్లిదండ్రులతో కలిసి ముజాయిద్‌నగర్‌లోని సోదరుడి ఇంటికి వెళ్లాడు. అదే రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. దుండగులు బీరువాను పగులగొట్టి ఆరు తులాల బంగారంతోపాటు రూ.70వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మద్నూర్(జుక్కల్): మంజీర వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను డోంగ్లీ మండలం లింబూర్ గ్రామ శివారులో పట్టుకున్నట్లు ఎస్సై విజయ్‌కొండ ఆదివారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అలాగే మద్నూర్‌లో వాహనాల తనిఖీలు చేస్తుండగా బిచ్కుంద నుంచి మద్నూర్‌కు తరలిస్తున్న రూ.1.80 లక్షల విలువైన గుట్కా పట్టుబడిందని ఎస్సై తెలిపారు.
కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో..
రుద్రూర్: ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను కోటగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం పట్టుకున్నట్టు ఎస్సై సందీప్ తెలిపారు. ఎత్తొండ గ్రామంలో నాలుగు, పొతంగల్ మండలం కొడిచర్లలో రెండు ట్రాక్టర్లను పట్టుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు సమాచారం అందించామని తెలిపారు.
బిచ్కుంద మండలంలో..
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని పుల్కల్ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పొలీసులు ఆదివారం పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఆరు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేశామని ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment