లక్ష్య సాధన కోసం కృషి చేయాలి
● కష్టపడితే ఏదైనా సాధించవచ్చు
● విద్యార్థులతో ఇంపాక్ట్ మోటివేటర్లు
కామారెడ్డి టౌన్: జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని ఇంపాక్ట్ మోటివేటర్లు సూచించారు. ఇంటర్నేషనల్ ఇంపాక్ట్, కామారెడ్డికి చెందిన లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద సంస్థల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కళాభారతిలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ఇంపాక్ట్ మోటివేటర్లు వజ్జ మహేందర్, నళిని, లాబిశెట్టి మహేశ్, వజ్జ నవనీత ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్న నమ్మకాన్ని కల్పించారు. ప్రణాళికాబద్ధంగా నడుచుకోవాలని, ఓటమికి కుంగిపోకుండా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఏడాదంతా చదవి చివరి ఘట్టం పరీక్షల్లో ఒత్తిడికి గురైతే చదివిందంతా వృథా అవడమే కాకుండా నిరాశకు గురవుతారన్నారు. భయాన్ని వీడితేనే విజయం వరిస్తుందని పేర్కొన్నారు. చదువుతోపాటు వివిధ రంగాల్లో కూడా రాణించాలన్నారు. తెలంగాణ నార్కొటిక్స్ విభాగం ఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరించారు. మత్తు, డ్రగ్స్‌కు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద అధ్యక్షుడు మారుతి, ప్రతినిధులు హరిధర్, భూపేష్, విజయానంద్, నవీన్, కృష్ణ హరి, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment