హత్య కేసులో భార్యాభర్తలకు జైలు
కామారెడ్డి టౌన్/ఎల్లారెడ్డి రూరల్: ఇంటి యజమానికి మత్తు మందు కలిపిన కల్లు తాగించి అతడి మరణానికి కారణమవడమే కాకుండా ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దంపతులకు జిల్లా న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. ఎస్పీ సింధు శర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2018 సెప్టెంబర్ 24న గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు గంజి దివ్య అలియాస్ లక్ష్మి, గంజి వెంకటేశం అలియాస్ గణేశ్ ఎల్లారెడ్డికి వచ్చారు. వస్త్ర వ్యాపారులుగా నమ్మించి వృద్ధ దంపతులైన కల్యాణి ఇంద్రమ్మ, శంకరయ్యల ఇంట్లో అద్దెకు దిగారు. వారం తర్వాత దివ్య, వెంకటేశం రెండు కల్లు సీసాలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఒకటి ఇంటి యజమానికి ఇచ్చి మరొకటి వారు తీసుకుని వెళ్లారు. ఇంటి యజమానికి ఇచ్చిన సీసాలో అప్పటికే మత్తుమందు కలిపి ఉంచారు. ఆ కల్లు తాగిన శంకరయ్య మరణించగా.. ఇంద్రమ్మ నిద్రలోకి జారుకుంది. నిందితులు దివ్య, వెంకటేశంలు ఇదే అదనుగా భావించి, కల్యాణి ఇంద్రమ్మ మెడలోని బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలతోపాటు బీరువా పగులగొట్టి అందులోని డబ్బు తీసుకుని పారిపోయారు. మరుసటి రోజు మృతుడి భార్య ఇంద్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సంఘటన స్థలంలో నిందితులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు కొనసాగించారు. నిందితులను గుంటూరు జిల్లాలో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. సాక్ష్యాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్‌ఆర్ వరప్రసాద్ సోమవారం తీర్పు ఇచ్చారు. వెంకటేశంకు మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 4 వేల జరిమానా, దివ్యకు ఏడాది జైలుతో పాటు రూ. 4 వేల జరిమానా విధించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎల్లారెడ్డి సీఐలు సుధాకర్, రవీంద్రనాయక్, ఎస్సైలు ఉపేందర్‌రెడ్డి, మహేశ్, కోర్టు లైజనింగ్ అధికారి మురళి, కోర్టు కానిస్టేబుల్ సాయిలును ఎస్పీ సింధుశర్మ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment