● డిసెంబర్‌లో అందుబాటులోకి పద్మనగర్ మార్కెట్ ● మేయర్
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్ సిటీలో భాగంగా పద్మనగర్‌లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ డిసెంబర్‌లో ప్రజలకు అందుబాటులోకి రానుందని మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. రూ.14 కోట్లతో చేపడుతున్న మార్కెట్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రజలకు అన్ని ఆహార పదార్థాలు ఒకేచోట లభించేలా అత్యాధునిక హంగులతో సమీకృత మార్కెట్లను నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదురుగా, పద్మనగర్ బుల్ సెమన్ స్థలంలో, కశ్మీగడ్డ రైతు బజార్‌లో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పద్మనగర్‌లో పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ఈ మార్కెట్‌లో 138 వెజిటబుల్ స్టాళ్లు, 38 నాన్‌వెజిటెబుల్ స్టాళ్లు వేర్వేరుగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. 22 ప్రత్యేక షట్టర్లు నిర్మిస్తున్నామని, వాటిని కిరాణా సామగ్రి విక్రయించుకునేందుకు కేటాయిస్తామన్నారు. మార్కెట్‌లో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, డ్రైనేజీ, పార్కింగ్, స్టోరేజీ, చుట్టూ ప్రహరీ, లోపల సీసీ కెమెరాల ఏర్పాటు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మిగతా మార్కెట్ల పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment