దళారుల దందా.. సిబ్బంది కొరత
● కొరవడిన సీసీఐ పర్యవేక్షణ ● సీపీవోల కొరతతో అన్నదాతకు నష్టం ● సొమ్ము చేసుకుంటున్న దళారులు
కరీంనగర్ అర్బన్: సీసీఐ, దళారుల మామూలు బంధంలో అన్నదాత చిక్కిశల్యమవుతున్నాడు. మద్దతు ధర అందేలా పర్యవేక్షించాల్సిన యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషించడంతో కళ్ల ముందే కర్షకుడి శ్రమ దోపిడీకి గురవుతోంది. సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించడమే ఆలస్యం కాగా తొలుత కొన్ని జిన్నింగ్ మిల్లులకే పరిమితం చేసింది. తదుపరి జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు సహాయ నిరాకరణ చేపట్టడంతో దిగొచ్చిన విషయం విదితమే. తేమ సాకుతో సీసీఐ కొనుగోళ్లకు నిరాకరిస్తుండగా ప్రభుత్వ మద్దతు ధర దక్కడం లేదు. రూ.6000–6500కే దళారులు కొనుగోలు చేస్తుండగా క్వింటాల్‌కు రూ.వేయికి పైగా నష్టపోతున్నారు.
నిబంధనల బూచీ.. సిబ్బంది ఏరి?
‘తేమశాతం 8 నుంచి 12 ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తాం. పక్కాగా 8 శాతం ఉంటే రూ. 7,521 మద్దతు ధర వస్తుంది. దానిపై 12 శాతం వరకు తేమ ఉంటే ఒక్కో పాయింట్‌కు రూ.75 చొప్పున కోత పడుతుంది. 12 శాతానికి పైగా తేమ ఉన్నట్లు భావిస్తే రైతులే పత్తిని ఇంటి వద్ద ఆర బెట్టుకొని తీసుకురావాలి’ అనే నిబంధనలను భారత పత్తి సంస్థ(సీసీఐ) అమలు చేస్తోంది. కానీ జమ్మికుంట, కరీంనగర్ సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఓ పత్తి కొనుగోలు అధికారి (కాటన్ పర్చేసింగ్ ఆఫీసర్(సీపీవో)) ఉండాలనే నిబందనలను మాత్రం పాటించడం లేదు. జిల్లాలో వరి తరువాత పత్తి సాగుకే ఎక్కువ మక్కువ చూపుతారు. ఇక్కడి పత్తి నాణ్యతలో మేలు రకమైందిగా ఖ్యాతి గడించింది. కానీ సీసీఐ తేమ పేరిట కొనుగోళ్లకు ముందుకురావడం లేదు. కొనుగోలు కేంద్రానికో సీపీవో ఉండాలనే నిబంధనలను పాటించటం లేదు. జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన సీసీఐ యంత్రాంగం నలుగురు సీపీవోలతో పర్యవేక్షణ చేస్తోంది. తేమ నిర్ధారణ సిబ్బంది ఇష్ట ప్రకారం కొనుగోళ్లు సాగుతుండటంతో నిబంధనల గురించి అవగాహన లేని రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం
సీసీఐ కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గోపాల్‌రావుపేట మార్కెట్ పరిధుల్లో జిన్నింగ్ మిల్లులుండగా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. మొత్తం 12 మిల్లులకు గానూ కేవలం నలుగురు సీపీవోలతో కొనసాగిస్తున్నారు. కొనుగోళ్లు సీపీవో పర్యవేక్షణలో సాగుతున్నాయి. కేంద్రాల్లో రైతులకు నష్టం చేకూర్చేలా సిబ్బంది పొరపాట్లు చేస్తే సీపీవో పరిష్కరించాల్సి ఉండగా దానికి భిన్నంగా సీపీవోలే లేకపోవడం గమనార్హం. మొత్తంగా పత్తి కొనుగోళ్ల వ్యవహారమంతా ఏకపక్షంగా సాగుతోంది.
అదనపు బాధ్యతలు.. అటకెక్కిన తనిఖీలు
సీసీఐ వ్యవహరం ఇలాగుంటే మార్కెట్ అధికారుల కొరతతో పర్యవేక్షణ పడకేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులకు జోడు పదవులుండటంతో ఎక్కడా సరియైన న్యాయం చేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా మార్కెటింగ్ అధికారికి రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ మూడు జిల్లాల బాధ్యతలు కాగా నిరంతర పర్యవేక్షణ అనుమానమే. దీంతో దళారులు ఎక్కడికక్కడ అన్నదాతను నిలువునా దోచుకుంటున్నారు. కలెక్టర్ చొరవ చూపి సీసీఐ కొనుగోళ్లపై పక్కా పర్యవేక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment