లగచర్ల రైతులను విడుదల చేయండి
కరీంనగర్: లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తోందని ఆరోపించారు. పేద దళిత, గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని, వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఓసారి ఫార్మా విలేజ్ అని, మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయమాటలతో భూములు తీసుకొని, అదానీకి, తన అల్లుడికి అప్పజెప్పాలని చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు బండారి వేణు, కంసాల శ్రీనివాస్, గందె మాధవి, జంగిలి సాగర్, దిండిగాల మహేశ్, బీఆర్‌ఎస్ కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment