వినూత్నం.. విభిన్నం
● దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ జీవితాల్లో ఉపాధి వెలుగు
● ప్రభుత్వ చేయూత సద్వినియోగం..
● దేశంలోనే ప్రథమ దివ్యాంగుల పెట్రోల్ బంక్
● ఆదరిస్తున్న సిరిసిల్ల వినియోగదారులు
సిరిసిల్లటౌన్: రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల ఉపాధికి దేశంలోనే ప్రప్రథమ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయగా.. వినియోగదారుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించే మంచి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికై ంది. ఆర్థిక పునరావాసం కింద దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మాణానికి సిరిసిల్ల పట్టణంలో శ్రీకారం చుట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాలతో రూ.2.50కోట్ల విలువైన భూమిని రాజన్న సిరిసిల్ల అధికార యంత్రాంగం కేటాయించింది. రూ.2.50కోట్లతో ఐవోసీఎల్ యాజమాన్యం మంజూరు చేసి బంక్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నేతృత్వ్యంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పక్షం రోజుల క్రితం ఏర్పాటు చేయగా.. బంక్ నిర్వహణ విజయవంతంగా కొనసాగుతోంది. మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ నుంచి రగుడు వరకు ఉన్న రెండో బైపాస్ రోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో ఐవోసీఎల్ ఆధ్వర్యంలో బంక్ నిర్మించారు. ఈనెల 7న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కలిసి ప్రారంభించారు.
24 మందికి..
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 24 మంది దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు పెట్రోల్ బంక్‌లో ఉపాధి కల్పించేందుకు అధికారులు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. ప్రతిరోజూ 24 గంటలు సేవలందిస్తున్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఈ బంక్‌లో వినియోగదారులకు సేవలందుతున్నాయి. నాణ్యత, కొలతల్లో మంచి గుర్తింపు సాధించి ముందుకు సాగుతోంది. స్వల్ప వ్యవధిలోనే ప్రతిరోజు దాదాపు రూ.లక్ష విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేయడం విశేషం.
తోడ్పాటు అందించాలి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పెట్రోల్ బంక్‌తో దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పిస్తున్నాం. నాణ్యమైన సేవలు వినియోగదారులకు అందుతున్నాయి. అందరూ పెట్రోల్ బంక్ సేవలు వినియోగించుకొని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు తోడ్పాటు అందించాలి.
– సందీప్‌కుమార్ ఝా, జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment