రేపటి నుంచి టీజీబీ సేవలకు అంతరాయం
కరీంనగర్‌రూరల్: కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ)లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ) విలీనం చేస్తున్నారు. కొత్త సంవత్సరం నుంచి టీజీబీ పేరుతో సేవలు అందుతాయి. 2006 సంవత్సరం మార్చి 31న ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో వరంగల్ జిల్లా ప్రధాన కేంద్రంగా ఏపీజీవీబీని ఏర్పాటు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ రెండు రాష్ట్రాలకు ప్రధాన కార్యాలయంగా కొనసాగుతోంది. తెలంగాణలో మొత్తం 493 బ్యాంకు శాఖలున్నాయి. ఏపీజీవీబీ విలీనం సందర్భంగా ఈనెల 28నుంచి 31వరకు టీజీబీల్లో ఆన్‌లైన్, మొబైల్, ఇంటర్నెట్, యూపీఐ, ఏటీఎం బ్యాంకింగ్ సేవలు, ఖాతాదారుల సేవాకేంద్రాలు అందుబాటులో ఉండవు. ఈ మేరకు టీజీబీ బ్రాంచిల్లో వినియోగదారుల సమాచారం కోసం ప్రత్యేకంగా నోటీసుబోర్డుపై నోటీస్‌ను అంటించారు. ఖాతాదారుల సెల్‌ఫోన్లకు వాట్సప్ మెస్సెజ్‌ను పంపిస్తున్నారు. అత్యవసరం ఉంటే ఈనెల 30, 31న బ్యాంకులో ఖాతాదారులు రూ.5వేల వరకు మాత్రమే నగదు డ్రా చేసుకునే సౌకర్యముందని పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ఖాతాదారులకు బ్యాంకుసేవలు యథావిధిగా అందుబాటులోకి వస్తాయని టీజీబీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment