మన్మోహన్‌తో అనుబంధం
● మాజీ ప్రధాని పీవీకి సన్నిహితుడు
● ఆర్‌ఎఫ్‌సీఎల్ పునరుద్ధరణలో
కీలకంగా వ్యవహరించిన మాజీ ప్రధాని
సాక్షి ప్రతినిధి, కరీంనగర్●:
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఉమ్మడి జిల్లాతో అనుబంధం ఉంది. కరీంనగర్ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సన్నిహితుడిగా ఇక్కడ పలు అభివృద్ధి పనులపై చెరగని ముద్ర వేశారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్‌సింగ్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే మన పీవీ. అనంతరం ఆయన 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవలందించారు. ఈ ఇద్దరు మేధావులూ డిసెంబర్ నెలలోనే తుదిశ్వాస విడిచారు. పీవీ 2004 డిసెంబర్ 23న మరణించగా, మన్మోహన్ డిసెంబర్ 26న కన్నుమూశారు.
ఆర్థిక మంత్రిగా..
1993లో పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వే లైన్‌కు కావాల్సిన నిధులు మంజూరు చేయడంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్ ప్రముఖ పాత్ర పోషించారు. పీవీ, మన్మోహన్ ద్వయం చేపట్టిన ఆర్థిక సంస్కరణల కారణంగా సింగరేణిలో యాంత్రీకరణ ఊపందుకుంది. ఎన్టీపీసీ విస్తరణలో ఆర్థికమంత్రిగా, ప్రధానిగా చేయూతనిచ్చారు. 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మూతపడిన ఎఫ్‌సీఐని ఖాయిలా జాబితా నుంచి తిరిగి పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. ఆ చర్యల ఫలితంగానే నాటి ఎఫ్‌సీఐ నేడు ఆర్‌ఎఫ్‌సీఎల్‌గా పునరుజ్జీవం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎమ్మెస్సార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లు మన్మోహన్‌తో సత్సంబంధాలు కొనసాగించారు.
తెలంగాణ ఏర్పాటులో మరువలేని పాత్ర
తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పాత్ర మరువలేనిది. మాజీ ప్రధానితో కలిసి తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నాను. ఉపాధిహామీ, సమాచార హక్కు చట్టాలు తీసుకొచ్చి, దేశ రూపురేఖలు మార్చారు.
– పొన్నం ప్రభాకర్,
బీసీ, రవాణా శాఖ మంత్రి
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు
పీవీ హయాంలో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన మహనీయుడు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్. ఆర్టీఐ, ఉపాధిహామీ తదితర పథకాలతో దేశ ప్రజలకు ఉపాధి, హక్కులను కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నేను మంత్రిగా పని చేసిన సమయంలో రాష్ట్రానికి ఆయన అందించిన సహకారం మరువలేనిది.
– శ్రీధర్‌బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment