వేసెక్టమీకి వెనకడుగు
● కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ముందుకురాని పురుషులు ● చేయించుకుంటే బలహీనపడతామన్న అపోహ ● గ్రామాల్లో కొరవడిన ప్రచారం ● ప్రత్యేక క్యాంపులు లేవు ● జిల్లాలో మహిళలకే జరుగుతున్న శస్త్రచికిత్స
కరీంనగర్‌టౌన్/హుజూరాబాద్ : కుటుంబ నియంత్రణ(కు.ని.) ఆపరేషన్ చేయించుకునేందుకు పురుషులు వెనకడుగు వేస్తున్నారు. అది మహిళ బాధ్యత.. తమకెందుకు తలనొప్పని చాలామంది చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ శస్త్రచికిత్స చేయించుకుంటే బలహీనపడిపోతామన్న అపోహలో ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రజల్లో అవగాహన కల్పించి, కు.ని. ఆపరేషన్ల సంఖ్య పెంచాల్సిన వైద్యశాఖ తనకు పట్టనట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆపరేషన్ మహిళలకు చేయడాన్ని ట్యూబెక్టమీ, పురుషులకు చేయడాన్ని వేసెక్టమీ అని పిలుస్తారు. కరీంనగర్ జిల్లాలో మహిళలే అధికంగా కు.ని. ఆపరేషన్ చేయించుకుంటున్నారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే ఆపరేషన్లు జరుగుతుండగా, గ్రామ్లాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 142 వేసెక్టమీలే జరిగాయి. ఈ ఆపరేషన్‌కు అర్హులైన పురుషులు సుమారు 45 వేల మంది ఉన్నారు.
పురుషులకే సులువు..
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మహిళలతో పోలిస్తే పురుషులకే సులువని వైద్యులు చెబుతున్నారు. మగవాళ్లకు ఎలాంటి కడుపుకోత లేకుండా 5 నుంచి 10 నిమిషాల్లో ఆపరేషన్ అయిపోతుంది. వాళ్లు వెంటనే ఇంటికి, పనులకు వెళ్లొచ్చని అంటున్నారు. వీర్యం ప్రయాణించే చిన్న వాహికకు గాటుపెట్టి, అక్కడే మూసివేస్తారు. ఒకసారి ఈ శస్త్రచికిత్స అయ్యాక మళ్లీ కావాలనుకుంటే దాన్ని తెరిచే అవకాశాలు కూడా ఉంటాయి. అదే మహిళలకు చేస్తే నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని నెలలపాటు బరువులు ఎత్తకూడదు. ఆపరేషన్ జరిగిన పొట్ట భాగంలో ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదమూ ఉంది.
ప్రోత్సాహకం రూ.1100..
వేసక్టమీ చేయించుకున్న వారికి ప్రభుత్వం రూ.1100 ప్రోత్సాహకం ఇస్తోంది. ఆపరేషన్ చేయించుకోవాలని ప్రోత్సహించి, ఆస్పత్రికి తీసుకొచ్చిన వారికి కూడా రూ.250 చెల్లిస్తారు. వేసెక్టమీ చేసిన వైద్యుడికి రూ.150 ఇస్తారు. అదే ట్యూబెక్టమీ చేయించుకునే మహిళలకు రూ.850, ప్రోత్సహించి, తీసుకొచ్చిన వారికి రూ.150 చెల్లిస్తారు.
ప్రసవ సమయంలోనే ట్యూబెక్టమీ..
వేసెక్టమీపై పురుషులకు అవగాహన లేకే ముందుకు రావడం లేదు. ఈ ఆపరేషన్ చేయించుకుంటే శారీరకంగా బలహీనమవుతామనే అపోహ కూడా ఉంది. ఫలితంగా ప్రసవ సమయంలోనే చాలా మంది మహిళలు ట్యూబెక్టమీ చేయించుకుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు గ్రామాల్లో వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండే ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లతో కలిసి విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.
అవగాహన కల్పిస్తాం
వేసెక్టమీపై ఉన్న అపోహలను తొలగించడానికి కృషి చేస్తున్నాం. ప్రధానంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయని పురుషుల్లో బలంగా నాటుకుపోయింది. ఇది నిజం కాదు. దీనిపై గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటీవల కు.ని. శిబిరాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ వెంకటరమణ,
డీఎంహెచ్‌వో, కరీంనగర్
ప్రతీ సోమవారం క్యాంపు
ఇటీవల కు.ని. క్యాంపులు నిర్వహిస్తున్నాం. ప్రతీ సోమవారం జిల్లా ఆస్పత్రిలో నిర్వహించే క్యాంపులో పురుషులు పెద్ద సంఖ్యలో వేసెక్టమీ చేయించుకుంటున్నారు. దీనిపై ప్రజల్లో కొంత అవగాహన వచ్చినట్లు అనిపిస్తోంది. ట్యూబెక్టమీ కంటే వేసెక్టమీ చాలా సులువైన పద్ధతి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – డాక్టర్ అలీం,
వేసెక్టమీ క్యాంపు నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment