షాపులు కేటాయించారు!
● ఎట్టకేలకు లక్కీ డ్రా ● 120 దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద ఉన్న సముదాయంలోని దుకాణాల కేటాయింపు ఎట్టకేలకు పూర్తయింది. సోమవారం కళాభారతిలో నిర్వహించిన లక్కీ డ్రా ద్వారా 120 దుకాణాలను వీధి వ్యాపారులకు కేటా యించారు. నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ స్వయంగా డ్రా తీయగా, మేయర్ యాదగిరి సునీల్‌రావు హాజరై పర్యవేక్షించారు.
120 దుకాణాలు కేటాయింపు
స్మార్ట్ సిటీలో భాగంగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద నిర్మించిన దుకాణాలను అద్దె ప్రాతిపదికన వీధి వ్యాపారులకు కేటాయించేందుకు నిర్వహించిన డ్రా ముగిసింది. మొత్తం 126 దుకాణాలకు, 6 దుకాణాలను నగరపాలకసంస్థ అవసరాలకు పక్కనపెట్టి, 120 దుకాణాలకు డ్రా తీశారు. కోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన జాబితా ప్రకారం 48 మంది పాత వీధి వ్యాపారులకు నేరుగా దుకాణాలు కేటాయించారు. ఇలా కేటాయించిన వారికి ముందుగా డ్రా తీసి షట్టర్ల నంబర్లు కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు మరొకరికి తుది జాబితాలో చోటు కల్పించారు. అనంతరం 769 మంది దరఖాస్తు దారులకు డ్రా నిర్వహించారు. పాత వీధి వ్యాపారులు, దరఖాస్తుదారులకు సంబంధించి డ్రాలో రిజర్వేషన్‌లు పాటించారు.
మాకూ అవకాశం ఇవ్వాలి
పాత వీధి వ్యాపారుల జాబితాలో తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు డిమాండ్ చేశారు. డ్రా ముగియగానే, తాము ఎప్పటినుంచో వ్యాపారం చేసుకుంటున్నామని, తమకు అవకాశం దక్కలేదంటూ పలువురు వేదిక వద్దకు వచ్చి, రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ జోక్యం చేసుకొని ఆందోళన చేస్తున్న వారి వివరాలు తెలుసుకున్నారు. అందులో భార్యాభర్తలు ఉండడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. భార్య, భర్తకు ఇద్దరికి ఎలా వస్తుందంటూ ప్రశ్నించారు. అర్హులుంటే తన దృష్టికి తీసుకురావాలని న్యాయం చేస్తాన్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు నిలువరించారు.
సమీకృత మార్కెట్‌లలోనూ చాన్స్ : మేయర్
సివిల్ హాస్పిటల్ దుకాణాల డ్రాలో అవకాశం దక్కని వీధి వ్యాపారులకు పద్మనగర్, కలెక్టరేట్ క్యాంప్ ఎదురుగా ఉన్న సమీకృత మార్కెట్‌లు, శాతవాహన యూనివర్సిటీ వద్ద నిర్మించిన దుకాణ సముదాయాల్లో అవకాశం ఉంటుందని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. డ్రా కు హాజరై మాట్లాడారు. రిజర్వేషన్‌ల ప్రకారం వీధి వ్యాపారుల ఎదుటనే పారదర్శకంగా డ్రా తీసి 120 దుకాణాలు కేటాయించామన్నారు. పద్మనగర్ సమీకృత మార్కెట్‌లో షట్టర్లకు దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం చివరి రోజని ఇందులో అవకాశం దక్కని వ్యాపారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
అనర్హులని తేలితే రద్దు చేస్తాం: కమిషనర్
తప్పుడు ధ్రువపత్రాలతో ఎవరైనా దుకాణాలు దక్కించుకున్నట్లు తమ దృష్టికి వస్తే రద్దు చేస్తామని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు, కౌన్సిల్ తీర్మానం మేరకు పాత వ్యాపారులు 48 మందికి, దరఖాస్తుదారులకు రిజర్వేషన్‌ల ప్రకారం డ్రా ద్వారా దుకాణాలు కేటాయించామన్నారు. దుకాణాలు పొందిన వ్యాపారులు వారం రోజుల్లో ఒప్పందం చేసుకోవాలని, లేదంటే రద్దు చేస్తామన్నారు. ఐదేళ్ల కాలపరిమితితో రూ.2 వేల చొప్పున నగరపాలకసంస్థకు అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్‌వో సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment