కడుపు కోత మిగిల్చిన ఈత సరదా
హుజూరాబాద్: ఊరి చెరువు ఓ తల్లికి కడుపు కోతను మిగిల్చింది. అప్పటివరకు కుటుంబ సభ్యులతో గడిపిన బాలుడు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఆదివారం ఈతకు వెళ్లిన బాలుడు నీటమునిగి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. కందుగుల గ్రామానికి చెందిన మచ్చ రాజు–భారతి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కూమారుడు వెంకటసాయి(13) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. పాఠశాలకు ఆదివారం సెలవు కావడంతో తమ్ముడు మణిదీప్‌తోపాటు నలుగురు స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న అంకుశవలి కుంటలో ఈత కొట్టడానికి వెళ్లాడు. చెరువులో దిగిన వెంకటసాయికు ఈత సరిగా రాక నీటమునిగి బయటికి రాలేదు. భయబ్రాంతులకు గురైన సోదరుడు మణిదీప్, మిగతా స్నేహితులు ఇంటికొచ్చి నానమ్మ సరోజనకు తెలిపారు. స్థానికులతో కలిసి చెరువుకుంట వద్దకెళ్లిన ఈతగాళ్లు ఎంత ప్రయత్నించినా మృతదేహం లభ్యం కాకపోవడంతో పట్టణంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారమందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. నీటి అడుగున బురదలో చిక్కుకున్న సాయి మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది బయటకు తీశారు. కుమారుడి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు సొమ్మసిల్లి పడిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ తిరుమల్‌గౌడ్ తెలిపారు.
చెరువులో బాలుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment