ఇంటింటా క్యారెల్స్‌లో క్రైస్తవులు
శివాజీనగర: మరో నాలుగు రోజుల్లో క్రిస్మస్...ప్రపంచం మొత్తం ఎంతో ఉత్సాహంగా పండుగ కోసం వేచి చూస్తోంది. ఇందుకు బెంగళూరు మినహాయింపేమి కాదు. నగరవాసులు కూడా కులమతాలకు అతీతంగా పండుగను జరుపుకునేందుకు సిద్దమయ్యారు. అన్ని షాపింగ్ మాల్స్, దుకాణాలు, హోటళ్లు కలర్‌ఫుల్‌గా మారాయి. ఎటు చూసిన క్రిస్మస్, నూతన సంవత్సరం వాతావరణం కొట్టొచ్చినట్లు దర్శనమిస్తోంది. క్రిస్మస్ అంటేనే క్రైస్తవుల పండుగ. దీంతో నగరంలోని అన్ని చర్చీలు ధగధగ మెరిసిపోతున్నాయి. స్టార్స్, మిరుమిట్లు గొలిపే కాంతులు, వివిధ ఆకారాల్లో తయారైన అలంకరణ వస్తువులు శాంతాక్లాజ్ ప్రతిమిలతో చర్చీలన్నీ మెరిసిపోతున్నాయి. విద్యుద్దీపలంకరణలో చర్చీలు కాంతులీనుతున్నాయి. ముఖ్యంగా బ్రిగేడ్ రోడ్డులోని సెయింట్ పాట్రిక్ చర్చ్, శివాజీనగరలోని సెయింట్ మేరీ బసిలికా చర్చ్, ఎంజీ రోడ్డులోని ఈస్ట్ పరేడ్ చర్చీ, రిజర్డ్స్ టౌన్‌లోని మిస్పా తెలుగు చర్చీలు సర్వాంగ సుందరంగా ముస్తాబై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
నవంబర్ 25 నుంచే సంబరాలు:
ప్రతి ఏటా సాధారణంగా జరిగే క్యారెల్స్ కార్యక్రమాలను అన్ని చర్చీలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. కార్యక్రమంలో భాగంగా చర్చీ పెద్దలు, సంఘ సభ్యులందరి ఇళ్లకు పాటలు పాడుకుంటూ వెళ్లి క్రిస్‌మస్ ఆనందాన్ని పంచుతుంటారు. క్రిస్మస్ నెల రోజుల ముందు నుంచే పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే ఈసారి కొన్ని చర్చీలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
25 అర్ధరాత్రి ఆరాధనలు, ప్రార్థనలు...
క్రైస్తవులు వివిధ శాఖలుగా ఉన్నా కూడా ఏటా జరుపుకునే రీతిలో డిశెంబర్ 25వ తేదీ అర్ధరాత్రి క్రైస్తవులందరూ కలసి ఆరాధన చేస్తారు. యేసుక్రీస్తు రాత్రి పూట జన్మించాడని విశ్వసించే క్రైస్తవులు అందుకు గుర్తుగా పండుగ అర్ధరాత్రే క్రిస్మస్ ఆరాధనను చేయడం పరిపాటి. అత్యంత పురాతనమైన సెయింట్ మేరీ బసిలికా చర్చీలో ఇప్పటికే భక్తులు తండోపతండాలుగా చేరుకుని ఆరాధనలు చేస్తున్నారు. భక్తుల కోరికలు తీర్చే మేరీమాతగా ఈ చర్చీ పేరు గాంచింది. క్రిస్‌మస్ పండుగ అర్ధరాత్రి చర్చీలో బాల యేసు ప్రతిమను ఊయలలో వేసి ఉంచుతారు. అదే విధంగానే మిస్పా తెలుగు చర్చీలో కూడా ప్రతి ఆదివారం వివిధ రీతిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు.
ముస్తాబైన చర్చీలు
విద్యుద్దీపాలతో జిగేల్‌మంటున్న వీధులు
వేడుకగా క్యారెల్స్
Comments
Please login to add a commentAdd a comment