వినతిపత్రం సమర్పిస్తున్న రైతులు
● రూ.7 లక్షల నగదు స్వాధీనం
సాక్షి బళ్లారి: అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ పట్టణంలోని హుళియారు రోడ్డులో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు నిలిపిన స్విఫ్ట్ కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న రూ.10 లక్షల నగదును చోరీ చేసి పరారైన ఘటనలో మిస్టరీని పోలీసులు చేధించారు. కారులో నుంచి నగదు దొంగిలించిన ఘటనలో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఇస్మాయిల్(41) అనే వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారణ చేసి అతని వద్ద నుంచి రూ.7 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. హొసదుర్గ పోలీసు అధికారి తిమ్మణ్ణ, సిబ్బందిని ఎస్పీ ధర్మేంద్రసింగ్ అభినందించారు. గురువారం దోపిడీ దొంగ నుంచి స్వాధీనం చేసుకొన్న నగదు, ఇతర వివరాలను పోలీసులు బహిరంగపరిచారు.
మంత్రి రాజీనామాకు డిమాండ్
రాయచూరు రూరల్: రాష్ట్రంలో చక్కెర శాఖా మంత్రిగా విధులు నిర్వహిస్తున్న శివానంద పాటిల్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు రంగనాథ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. రాష్ట్రంలో కరువు రావాలని రైతులు కోరుకుంటున్నారని మాట్లాడటాన్ని ఖండించారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే రూ.5 లక్షలు పరిహారం వస్తుందనే ఆశతో రైతులున్నారని మంత్రి పేర్కొనడం తగదన్నారు. మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు.
30న సంగీత సమ్మేళనం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 30న సంగీత పితామహుడు పండిత సిద్దరామ జంబలదిన్ని జ్ఞాపకార్థం 35వ సంగీత సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ క్లారినెట్ విద్వాంసుడు, స్వర సంగమ సంగీత కళాశాల అధ్యక్షుడు వడవాటి నరసింహులు అన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయ నగర్‌లోని స్వర సంగమ సంగీత కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో ఎంపీ రాజా అమరేశ్వర నాయక్, ఎస్పీ నిఖిల్, స్వామీజీలు పాల్గొంటారన్నారు.
అంజనాద్రి బెట్టలో స్వచ్ఛ భారత్
గంగావతి: అంజనాద్రి బెట్ట వద్ద హనుమాన్ మాలధారుల దీక్ష విరమణ అనంతరం విజయనగర జిల్లాకు చెందిన యువ బ్రిగేడ్ సంస్థ వారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. మాలధారులు తుంగభద్ర నది పరిసరాలు, విజయనగర కాలువలు, ఇతర ప్రాంతాల్లో వదిలేసిన కాషాయ వస్త్రాలను సంస్థ కార్యకర్తలు తొలగించారు. ఈసందర్భంగా సంస్థ సంచాలకులు బసవరాజ్ మాట్లాడుతూ మాలధారులు తాము వదిలిన మాలలు, వస్త్రాలను వచ్చే ఏడాది నుంచి ఒకే చోట వేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపై అంజనాద్రి బెట్ట వద్ద తరచూ స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
నందిబండిలో చిరుత ప్రత్యక్షం
కంప్లి: మరియమ్మనహళ్లి సమీపంలోని నందిబండి గ్రామ శివారులోని చెరువు వద్ద చిరుత ప్రత్యక్షమైంది. అదే ప్రాంతంలో వస్తున్న మేకపై దాడి చేసి చంపేసింది. చిరుత దాడిలో బలైన మేకను అదే గ్రామానికి చెందిన దురుగప్ప అనే రైతుకు చెందినదిగా గుర్తించారు. నందిబండితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు తెలిపారు. చిరుత వల్ల తమ గ్రామస్తులకు భయం ఆవరించిందని, ఈనేపథ్యంలో అటవీ శాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment