ఆందోళనలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు
● కరువు విలయతాండవం చేస్తున్నా
పట్టించుకోని సర్కార్
● కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన
కేఆర్‌పీపీ నేతలు
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో ఓ వైపు కరువు విలయతాండవంతో రైతన్నలు పెట్టిన పంటలు పూర్తిగా నష్టపోయి వలసబాట పడుతుండగా, మంచినీటి సమస్య జటిలమై పాలన అస్తవ్యస్తంగా మారినా సమస్యలను పరిష్కరించాల్సిన సీఎం సిద్ధరామయ్య, పలువురు మంత్రులు కులమతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నారని కేఆర్‌పీపీ నేతలు ధ్వజమెత్తారు. మండ్య జిల్లా కెరగోడు గ్రామంలో నెలకొన్న హనుమధ్వజ వివాదంపై సోమవారం కేఆర్‌పీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోనాల్ రాజశేఖర్‌గౌడ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మైనార్టీలు తప్ప హిందువుల సంక్షేమం గురించి పట్టడం లేదన్నారు. మత ఘర్షణలు లేవనెత్తడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. హనుమధ్వజాన్ని అదే స్థలంలో ఉంచకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. అయోధ్యలో రామలల్లా విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు కెరెగోడులో 108 అడుగుల ఎత్తులో ఎగరేసిన హనుమ ధ్వజాన్ని సర్కార్ ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రాయల్ సర్కిల్ వద్ద పార్టీ నేతలు బైఠాయించి, అక్కడ నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అంజి, సునీల్‌రెడ్డి, హంపీ రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment