దర్శన్‌తో నిర్మాతలు, దర్శకుల భేటీ
సాక్షి బళ్లారి: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సినీ నటుడు దర్శన్‌ను సంగీత దర్శకుడు హరికృష్ణ, నిర్మాత శైలజ, నాగ్ తదితరులు భేటీ అయ్యారు. గురువారం బళ్లారి సెంట్రల్ జైలుకు పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొన్నారు. ఐదు మందికి పైగా ప్రముఖ సినీ నిర్మాతలు, దర్శకులు దర్శన్‌ను కలిసి చర్చించారు. దర్శన్‌ను కలిసిన ప్రముఖులు తమ హృదయాల్లో దర్శన్‌కు చెరగని ముద్ర ఉందన్నారు.
ట్రాక్టర్, బైక్ ఢీ–ముగ్గురు మృతి
సాక్షి బళ్లారి: ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన ఘటన కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా హలకట్టి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో గురూజీ తండాకు చెందిన హర్షన్ రాథోడ్, రోహిత్, కృష్ణ అనే ముగ్గురు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. చిత్తాపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సమర్థంగా వ్యర్థాల
నిర్వహణకు సూచన
హొసపేటె: పర్యావరణ నిర్వహణ, విధాన పరిశోధన సంస్థ ద్వారా పట్టణ స్థానిక సంస్థల అధికారులకు వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, ఈపీఆర్, సమాజ భాగస్వామ్యం ప్రాముఖ్యతపై ఒక రోజు శిక్షణా సదస్సును జిల్లాధికారి దివాకర్ ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, బయోమెడికల్ వ్యర్థాలతో సహా వివిధ ముఖ్యమైన వాటి గురించి వివరించారు. అధికారులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని తమ తమ రంగాల్లో పనిని సమర్థవంతంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు రిసోర్స్ పర్సన్‌లుగా పాల్గొని సుమారు 70 మంది నగర, స్థానిక సంస్థల అధికారులకు వేస్ట్ మేనేజ్‌మెంట్ నియమాలు, ఈపీఆర్, కమ్యూనిటీ భాగస్వామ్యం ప్రాముఖ్యతను వివరించారు. వర్క్‌షాప్‌లో మున్సిపల్ అడ్మినిస్టేషన్ డైరెక్టరేట్ అధికారులు మనోహర్, సిబ్బంది, వివిధ నగర, స్థానిక సంస్థల అధికారులు పాల్గొన్నారు.
హాస్టల్‌లో తహసీల్దార్ తనిఖీ
హొసపేటె: దేవరాజు అరసు పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని తహసీల్దార్ శృతి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థులకు కనీస వసతులు, ఆహారం నాణ్యత, మరుగుదొడ్ల పరిశుభ్రత తదితర అంశాలను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. విద్యార్థుల డైనింగ్ ఏరియా, గదులను పరిశీలించిన ఆమె పరిశుభ్రతపై మరింత దృష్టి సారించాలని, హాస్టల్‌లో చిన్న చిన్న లోపాలను సరి చేయాలని హాస్టల్ సూపర్‌వైజర్‌ను ఆదేశించారు. తాలూకా కార్యాలయ అధిపతి శ్రీధర్, పీడీఎస్ మంజునాథ్, వార్డెన్ అశ్వని, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.
విద్యార్థుల షూ, సాక్సులు చెత్త పాలు
రాయచూరు రూరల్: సర్కార్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫాంతో పాటు షూ, సాక్సులు అందిస్తోంది. అయితే పాఠశాల ముఖ్యస్థులు వాటిని పంపిణీ చేయకుండా చెత్తకుండీలో పడేసిన ఘటన నగరంలోని లింగసూగూరు రోడ్డులో గురువారం వెలుగు చూసింది. పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జూన్ నెలలోనే వచ్చిన వాటిని నిల్వ ఉంచి అధికారులు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల చివరికి రోడ్డు పక్కన పడేశారు. కాగా ఈ విషయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment