బంగ్లాదేశ్ అకృత్యాలపై నేడు నిరసన ర్యాలీ
తుమకూరు: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న నిరంతర దౌర్జన్యాలు, ఆలయాల ధ్వంసం వంటి అకృత్యాలను ఖండిస్తూ బుధవారం నగరంలో హిందూ రక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరుగుతుందని స్వామీజీలు తెలిపారు. వివిధ మఠాధిపతులు, సంఘాల నాయకులు మంగళవారం నగరంలో పత్రికాగోష్టిని నిర్వహించారు. బుధవారం జరిగే నిరసనలో తాము కూడా పాల్గొంటామని తెలిపారు. బెట్టదహళ్లి గవిమఠం చంద్రశేఖర స్వామీజీ, తంగనహళ్లి మఠం బసవమహాలింగ స్వామీజీ, బెళ్లావి కారదమఠం కారద వీరబసవ స్వామీజీ, దొడ్డగుణి మఠం రేవణసిద్ధ శివాచార్య స్వామీజీ, బీజీ ప్రదీప్‌కుమార్‌లు మాట్లాడుతూ ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం 10.30 గంటలకు బీజీఎస్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, వినతిపత్రం సమర్పిస్తారని తెలిపారు.
సూరీడు రాక నాలుగు రోజులైంది
● శివమొగ్గలో చలి చలి
శివమొగ్గ: ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాలు కురిసిన మలెనాడులో ఇప్పుడు బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన తుపాను ప్రభావంతో చలికాలంలోనూ జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. సోమవారం సాయంత్రం నుంచి ప శ్చిమ కనుమలతో పాటు పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. వర్షంతో పాటు చల్లగాలులు కూడా జోరుగా వీస్తున్నాయి. ఇలా అనూహ్యమైన వాతావరణంతో ప్రజల ఆరోగ్యం కూడా తలకిందులవుతోంది. చలిజ్వరం, దగ్గు పడిశంతో చిన్నా పెద్దా ఆస్పత్రులకు వెళ్తున్నారు. కాగా రాబోయే రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఎల్లో అలర్ట్ ఉంటుంది. గత మూడు నాలుగు రోజుల నుంచి సూర్యుడు కనిపించడం మానేశాడు. పగటి వేళలో కూడా చల్లని వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు ఎండ కోసం తపించాల్సి వస్తోంది.
బీజేపీ నేతలపై ఎన్నికల
బాండు కేసు కొట్టివేత
శివాజీనగర: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని దుర్వినియోగం చేసుకొని ఎన్నికల బాండ్ పేరుతో మోసాలకు పాల్పడ్డారని బెంగళూరులోని తిలక్ నగర పోలీస్‌స్టేషన్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జే.పీ.నడ్డా, విజయేంద్ర తదితరులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. తమపై రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టడం అక్రమం, ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ బీజేపీ నేత నళిన్‌కుమార్ కటీల్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న ధర్మాసనం విచారించి ఈ ఆదేశాలిచ్చింది.
ఐవీ ఫ్లూయిడ్స్‌లో ఫంగస్!
బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ఆస్పత్రులో వినియోగిస్తున్న ఐవీ ఫ్లూయిడ్స్ సురక్షితం కాదని, సుమారు 92 ఐవీ నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా, వాటిలో 22 నమూనాలలో ప్రమాదకర ఫంగస్, బ్యాక్టీరియా కనిపించినట్లు సమాచారం. దీంతో పలు ఆస్పత్రుల్లో వినియోగించే అనేక ఐవీ ఫ్లూయిడ్స్ సురక్షితం కాదని ల్యాబ్ నివేదిక ప్రకారం బయటపడింది. దీనిపై కేంద్రానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. పశ్చిమ బెంగాల్‌లోని కేంద్ర ల్యాబ్‌కు కూడా శ్యాంపిల్స్ పంపించామని, ఈ నెల 9న నివేదిక రానుందని తెలిపారు. విచ్చలవిడి లాభాల కోసం నాసిరకం కంపెనీలు తయారుచేసే ఐవీ ఫ్లూయిడ్స్‌ను కొన్ని ఆస్పత్రులలో ఉపయోగిస్తారు. వాటిలో ఫంగస్, బ్యాక్టీరియాలు సులభంగా ఏర్పడుతుంటాయి. అలాంటివి రోగులకు ఎక్కిస్తే మరణించే ప్రమాదం ఉంది.
పవిత్ర బెయిలుపై
హైకోర్టులో వాదనలు
శివాజీనగర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలు, నటి పవిత్రగౌడ బెయిలు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుతో సంబంధమున్న అందరికీ సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ జడ్జి విశ్వజీత్ శెట్టి 6వ తేదీకి విచారణ వాయిదా వేశారు. అంతకు ముందు వాదనలు సాగాయి. పవిత్రగౌడ న్యాయవాది టామి సెబాస్టియన్ అర్ధ గంటపాటు వాదనను వినిపిస్తానని చెప్పారు. పవిత్రాగౌడ, నటుడు దర్శన్ సహజీవనంలో ఉన్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నుంచి పవిత్రగౌడకు రేణుకాస్వామి అశ్లీల మెసేజ్‌లు పంపేవాడన్నారు. ఏప్రిల్‌లో రేణుకాస్వామి మొబైల్ నంబర్‌ను పవిత్రాగౌడ సేకరించారన్నారు. మరో నిందితుడు దర్శన్ పూర్తిస్థాయి బెయిల్ పిటిషన్ కూడా అదేరోజుకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment