యూపీ గజదొంగ.. బెంగళూరులో దోపిడీలు
బనశంకరి: ఇళ్లలో చోరీలకు పాల్పడే ఘరానా అంతరాష్ట్ర గజ దొంగను మంగళవారం అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.1.36 కోట్ల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ జిల్లా జైలులో ఉన్న దొంగ ఫయాజ్‌ను అదుపులోకి తీసుకుని నగర పోలీసులు విచారించగా వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు నోరు విప్పాడు. ఇతడిపై ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో వివిధ పోలీస్‌స్టేషన్లులో మొత్తం 65 కేసులు ఉండడం గమనార్హం. గతంలో సుపారీ కిల్లర్‌గా ఉండగా, తరువాత దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇతని జతలో ఉండే మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వేలి ముద్రల ఆధారంగా
ఇటీవల ఆరోగ్యలేఔట్ నివాసి కుటుంబంతో విహారయాత్ర కు వెళ్లగా ఫయాజ్ ముఠా చొరబడి డబ్బు బంగారం దోచుకెళ్లింది. వేలిముద్రలు సేకరించి ఆరా తీయగా పాత దొంగ ఫయాజ్ అని, ఇప్పటికే యూపీలో అరెస్టయి జైలులో ఉన్నాడని గుర్తించారు. నగర పోలీసులు అక్కడకు వెళ్లి తీసుకొచ్చారు. బెంగళూరులో 11 చోట్ల దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. ఎత్తుకెళ్లిన బంగారు నగలను ఉత్తరప్రదేశ్‌లోని పలు బంగారు దుకాణాల్లో విక్రయించినట్లు తెలిపాడు. దీంతో ఆయా షాపుల్లో సోదాలు చేసి మొత్తం 1 కేజీ 700 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎట్టకేలకు పట్టివేత
రూ. 1.36 కోట్ల బంగారం స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment