ఊరూరా సరదాల సంక్రాంతి
సాక్షి బళ్లారి: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగ నేపథ్యంలో ప్రతి ఇంట రంగు రంగుల ముగ్గులను వేసి, కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆచరించారు. పండుగ వేళ ఇతర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులు విచ్చేయడంతో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు కిటకిటలాడాయి. పండుగ సందర్భంగా ప్రతి ఇంట సాంప్రదాయమైన పిండి వంటలు, సద్ద రొట్టెలు తదితర వంటలు చేసుకొని ఆనందంగా గడిపారు. రాజకీయ నాయకులు, వ్యాపారులు, రైతులు ప్రతి వర్గానికి చెందిన వారు ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం విశేషం. సంకాంత్రి అంటేనే రైతులకు కొత్త శోభను తెచ్చిపెడుతుందని, పండుగకు ముందు రైతుల పంటలు పండి ధాన్యం ఇంటికి చేరి ఊరటను ఇస్తున్న నేపథ్యంలో సంక్రాంతి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా ఆచరించుకొన్నారు.
ఆకట్టుకొన్న ముగ్గులు
హొసపేటె: సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం నగరంలో పండుగ ముగ్గులు ఎంతో ఆకట్టుకొన్నాయి. ఉదయం నగరవాసులు స్నానాలు చేసి కొత్తబట్టలు ధరించారు. మహిళలు తమ ఇంట ముంగిట రంగుల ముగ్గులు వేశారు. అదే విధంగా పండుగకు కావాల్సిన చెరుకు గడలు, గుమ్మడికాయ, టెంకాయ, పూలు పండ్లను జోరుగా కొనుగోలు చేశారు. పండుగ సందర్భంగా అరటి మొక్కలు, పూలు, పండ్లు, గుమ్మిడికాయ ధరలు రెట్టింపయ్యాయి.
హంపీకి పోటెత్తిన భక్తజనం
దక్షిణకాశీగా పేరొందిన హంపీలో మంగళవారం వేలాది మంది భక్తులు విరుపాక్షేశ్వరుడు, పంపాదేవిని దర్శించుకున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా హంపీకి తండోపతండాలుగా చేరుకున్న భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయ ఆవరణలో క్యూలో నిలబడి విరుపాక్షేశ్వరుని దర్శించుకొన్నారు. భక్తులు స్వామి వారికి పూలు, పండ్లు సమర్పించి భక్తిని చాటుకున్నారు. మధ్యాహ్నం కుటుంబంతో కలిసి నది ఒడ్డున భోజనం చేశారు. హంపీలోని ఏకశిలా బడవిలింగ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చక రాఘవ భట్ బడవిలింగ విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి పూజించారు. విఠల ఆలయం, హజారరామ ఆలయం, కమలమహల్, రాణిస్నానం మందిరం, మహానవమి దిబ్బ, గజశాల, ఉగ్రనరసింహ తదితర స్మారక కట్టడాలను వీక్షించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళల నుంచి పర్యాటకులు రావడంతో హంపీ పర్యాటకులతో నిండిపోయింది.
వైభవంగా మకర సంక్రాంతి
రాయచూరు రూరల్: జిల్లాలో ప్రజలు మకర సంక్రాంతి పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమంలో యువకులు, మహిళలు, పిల్లలు స్నానం ఆచరించారు. కృష్ణా నది వద్ద భక్తుల కోలాహలం అధికంగా కన్పించింది. సంక్రాంతి పూజలు జరిపి అక్కడే అన్న ప్రసాదాలను ఆరగించారు. మంత్రాలయం, చిక్క మంచాల వద్ద కృష్ణా నదిలో భక్తులు స్నానం ఆచరించి పూజలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment