నిందితుడిని కఠినంగా శిక్షించండి
బళ్లారిటౌన్: తోరణగల్లులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే బంధించి కఠిన శిక్ష విధించాలని ఏఐఎంఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధ్యక్షురాలు కేఎం.ఈశ్వరి తదితరులు నగరంలో నిరసన తెలిపి జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలి పనుల కోసం జార్ఖండ్ నుంచి తోరణగల్లుకు వచ్చిన దంపతుల ఐదేళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఆ బాలికను తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడన్నారు. అత్యాచార నిందితుడి ఆచూకీ తెలుసుకొని బంధించి పోక్సో చట్టం కింద కేసు దాఖలు చేసుకోవాలన్నారు. ఈ సంఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ బెంగళూరులో కూడా ఇటీవల ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏఐఎంఎస్‌ఎస్ పదాధికారులు పద్మ, విద్య, గిరిజ, సౌమ్య, వివిధ కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment