పేరుకే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి
సాక్షి,బళ్లారి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్రకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఆయన వాల్మీకి అభివృద్ధి మండలి నిధులను పక్కదారి పట్టించడంలో కీలకపాత్ర పోషించారనే ఆరోపణలతో జైలు పాలుకావడంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి ఏడాది క్రితం తప్పించారు.
నత్తనడకన అభివృద్ధి పనులు
అప్పటి నుంచి జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకునే మంత్రి లేకపోవడంతో జిల్లాలో అభివృద్ధి మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. విజయనగర జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా అంతంత మాత్రంగా పని చేస్తూ తూతూ మంత్రంగా ఆ జిల్లాకు వచ్చి వెళుతున్నారు. ఆయన బెంగళూరులో వ్యాపార లావాదేవీలు చూసుకునేందుకు సమయం సరిపడని వ్యక్తికి సుదూరమైన విజయనగర జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఇవ్వడంతో ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలే పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో బళ్లారిజిల్లా బాధ్యతలను కూడా మళ్లీ జమీర్‌కే అప్పగించడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన కేడీపీ సమావేశానికి వచ్చి వెళ్లిన ఆయన తర్వాత జిల్లాకు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో జిల్లాస్థాయి నుంచి తాలూకా స్థాయి అధికారుల వరకు ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
బాలింతలు మరణించినా జాడలేని వైనం
జిల్లాకు చెందిన ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వారే ఉండగా, ఎవరికై నా ఒకరికి మంత్రి పదవి ఇస్తారనే ఆశలు పెట్టుకున్నారు. నాగేంద్రను పదవి నుంచి తప్పించిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ పక్కన పెట్టడంతో కనీసం జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రి కూడా జిల్లాపై అవగాహన ఉన్న వ్యక్తినే లేదా ఇష్టమైన మంత్రికో బాధ్యతలు అప్పగించడంపై సీఎం చొరవ తీసుకోకపోవడంతో సీఎం మాత్రం బళ్లారి జిల్లాపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో ఐదు మంది బాలింతలు మృతి చెందిన కనీసం ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు కూడా జమీర్ రాకపోవడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఆస్పత్రిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కూడా ఆయన రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాపై ఏమాత్రం ఇష్టం లేని జమీర్‌ను ఇన్‌ఛార్జి మంత్రి నుంచి తప్పించి వేరొకరికి బాధ్యతలు ఇవ్వాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
నాలుగు నెలలైనా జిల్లాకు రాని
జమీర్ అహమ్మద్
జిల్లాకు మంత్రి లేరు..ఇన్‌ఛార్జి మంత్రి పత్తానే లేరు
సీఎం సిద్దరామయ్యకు జిల్లాపై సవతి ప్రేమా?
Comments
Please login to add a commentAdd a comment