19న సామూహిక వివాహాలు
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్విలో ఈనెల 19న 5001 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు కేఎస్‌ఎస్ సాంఘీక సేవా సమితి సమన్వయ సంస్థ అధ్యక్షుడు తిమ్మారెడ్డి గౌడ వెల్లడించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి శివనగౌడ నాయక్ ఆధ్వర్యంలో దశాబ్దం నుంచి రాయచూరు, సిరవార మాన్వి, కొప్పళ ప్రాంతాల్లో సమాజ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మాన్విలో రాయచూరు రోడ్డులోని ప్రైవేట్ పాఠశాలలో జరిగే వివాహాల్లో కేంద్ర మంత్రి వీ.సోమణ్ణ, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్వామీజీలు పాల్గొంటారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పరాజ్, గంగాధర నాయక్, నాయకులు శరణప్పగౌడ, రాఘవేంద్ర, రమానందలున్నారు.
వేడుకగా హాలుమత ఉత్సవాలు
రాయచూరు రూరల్: జిల్లాలో హాలుమత ఉత్సవాలు వేడుకగా జరిగాయి. మంగళవారం దేవదుర్గ తాలూకా తింథిణి వంతెన వద్ద మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాలకు ముగింపు పలికారు. ఈసందర్భంగా హొసదుర్గ కనక గురు పీఠాధిపతి ఈశ్వరానంద స్వామీజీ మాట్లాడుతూ కురుబలకు మరో పేరు హాలుమత అన్నారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో తమ పాత్ర ఉంటుందన్నారు. కురుబ విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో సిద్దరామానందపురి, లక్ష్మణ స్వామీజీ, భీమణ్ణ, చంద్రశేఖర్, తిమ్మారెడ్డి, అమృతరావు, నాగరాజ్, సిద్దణ్ణలున్నారు.
ఘనంగా బనశంకరీదేవి రథోత్సవం
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు కౌలుపేటలో బనశంకరీ దేవి రథోత్సవం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా రథంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో మహాప్రసాదం అందజేశారు. సాయంత్రం అలంకరించిన బనశంకరీ దేవి రథంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి రథోత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి రథోత్సవానికి భక్తులు అరటిపళ్లు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
వైభవంగా అంబా దేవి జాతర
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకా సోమలాపుర సమీపంలోని అంబా మఠంలో వెలసిన అంబాదేవి జాతర, రథోత్సవాలు వైభవంగా ముగిశాయి. సోమవారం రాత్రి ఆలయంలో అమ్మవారికి వందలాది మంది భక్తుల సమక్షంలో విశేష పూజలు చేశారు. గురుదత్త, అమరేష్, శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, సిద్దనగౌడ నాయక్, బసవరాజ హిరేగౌడ, డీఎస్పీ తళవార్, సీఐ వీరారెడ్డి, తహసీల్దార్ అరుణ కుమార్‌లున్నారు.
స్వామి వివేకానందకు పుష్పాంజలి
రాయచూరు రూరల్: మనస్సు ఉంటే ఏ సమాజ సేవ అయినా చేయవచ్చని జిల్లా క్రీడా యువజన సేవా శాఖ అధికారి ఈరేష్ నాయక్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద జయంతిలో పాల్గొని మాట్లాడారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా సమాజ సేవ అందించిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. కార్యక్రమంలో రాజణ్ణ, విద్యా సాగర్, గిరిధర్ పూజారి, సుమా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment